
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. చిత్రంలో మంత్రి ఈటల, ఇతర ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోకాలడ్డుతోందని.. ఎన్ని కుప్పిగంతులేసినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం కరీంనగర్‌లోని మానేరువాగుపై రూ.149 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి, కమాన్ నుంచి సదాశివపల్లి వరకు రూ.34 కోట్లతో చేపట్టనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ పట్టించుకునే స్థితిలో లేరని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల అవసరాలను తెలుసుకుని పనిచేస్తోందన్నారు. ప్రాజెక్టులు, కరెంటు, రహదారులు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. కరీంనగర్‌లో రూ.149 కోట్లతో నిర్మాణం జరగనున్న కేబుల్ బ్రిడ్జి సౌతిండియాలోనే మొదటిదని అన్నారు. బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్‌కు మణిహారంలా ఉంటుందన్నారు.
కరీంనగర్ ప్రజలు హక్కుదారులు..
ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన కరీంనగర్ ప్రజలు ప్రభుత్వంలో హక్కుదారులని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనని కేసీఆర్ క్లాక్‌టవర్ సాక్షిగా చెప్పారని అన్నారు. ఎన్ని నిధులైనా అడిగి తీసుకునే హక్కు మనకుందన్నారు. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ పచ్చగా మారిపోతుందని, కరీంనగర్ వాటర్‌హబ్‌గా నిలుస్తుందని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment