‘భద్రాచలం’ పనులు ప్రారంభించండి
- రైల్వే శాఖను కోరిన మంత్రి తుమ్మల
- రైల్వే లైన్‌కు భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రైల్వేను రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీ ల్ శర్మ, ఈఎన్‌సీ రవీందర్‌రావులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. భద్రాచలం రోడ్ స్టేషన్ మీదుగా సత్తుపల్లిని అనుసంధానిస్తూ ఏపీలోని కొవ్వూరు వరకు 133 కి.మీ.ల దూరంతో మంజూరైన రైల్వే లైన్ ప్రాజెక్టులో రూ.704 కోట్ల వ్యయంతో చేపట్టే భద్రాచలం రోడ్-సత్తుపల్లి సెక్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు.
నిర్మాణ వ్యయాన్ని సింగరేణి కాలరీస్ సంస్థ భరించనున్నందున పనులు ప్రారంభించటంలో జాప్యం ఉండొద్దన్నారు. రైల్వే లైన్ వల్ల సాధారణ ప్రయాణికులకు, సింగరేణికి ఎంతో ఉపయోగం ఉన్నందున ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రైల్వే లైన్‌కు కావాల్సిన 500 ఎకరాల భూ సేకరణ పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో మంజూరైన పాండురంగాపురంృకొత్తగూడెం రోడ్ లైన్‌కు సంబంధించి సర్వే చేయాలని, భద్రాచలం దేవాలయానికి వచ్చే భక్తులకు ఈ లైన్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణాల గురించి కూడా తుమ్మల వాకబు చేశారు.
2 నెలలకోసారి సమావేశాలు: సీఎస్
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరిగేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో 2 నెలలకోసారి సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వెల్లడించారు. రైల్వే జీఎం, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మెదక్-అక్కన్నపేట, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ల పురోగతి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. చర్లపల్లి, వట్టినాగులపల్లి టర్మినల్స్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మునీరాబాద్‌ృమహబూబ్‌నగర్ లైన్ భూ సేకరణను వేగిరం చేయాలని ఆదేశించారు. మానవరహిత లెవల్ క్రాసింగ్స్‌కు 28 చోట్ల అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులివ్వాలని, ఆర్‌ఓబీలు పూర్తయిన చోట అప్రోచ్ రోడ్లను నిర్మించాలని ఆదేశించారు.