ఇసుక తవ్వకాలపై సర్కార్ సీరియస్ | Serious government on sand mining | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలపై సర్కార్ సీరియస్

Published Wed, May 27 2015 1:30 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

Serious government on sand mining

వంతెనల వద్ద తవ్వకాలను అరికట్టాలి
బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని వంతెనల తనిఖీ
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

 
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. బాసరలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా నిర్మిస్తున్న స్నానఘట్టాల కోసం నదీగర్భం నుంచే అక్రమంగా ఇసుకను తోడుతున్న తీరును ‘ఇసుక కోసం వంతెనలకు ఎసరు’ శీర్షికతో రెండు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. మేజర్ బ్రిడ్జీలకు 500 మీటర్లలోపు ఇసుక తవ్వవద్దనే నిబంధన ఉన్నా బాసరలో వంతెనలకు అతి చేరువలో పొక్లెయిన్‌తో ఇసుకను ఎలా తవ్వుతున్నారని ఆయన ఉన్నతాధికారులను ప్రశ్నించారు.

దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇసుక తవ్వేందుకు గనుల శాఖ అనుమతి ఇచ్చి ఉంటే సంబంధిత అధికారులపై చర్యలకు సిఫారసు చేయనున్నట్టు చెప్పారు. అనుమతి లేని ఇసుక తవ్వకాలను నిరోధించడంలో విఫలమైన ఆర్‌అండ్‌బీ అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. వంతెనలకు ఏమేరకు ప్రమాదం పొంచి ఉందో పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ నాణ్యత నియంత్రణ విభాగం ఈఎన్‌సీ బిక్షపతిని ఆదేశించారు. భద్రాచలం వరకు అన్ని వంతెనలను పరిశీలించి ఎక్కడెక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో తేల్చాలని ఆదేశించారు. అన్ని వంతెనల వద్ద తవ్వకాల వల్ల జరిగే అనర్థాలను వివరించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రోడ్లు, వంతెనల పనుల వివరాలు ఫేస్‌బుక్‌లో...

 తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఫొటోల రూపంలో వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పనులకు పూర్వం, పనుల సమయంలో, పనుల తర్వాత.. ఇలా ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిని హరితహారంగా మార్చాలని సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement