‘గులాబీ’ గాలం
టీఆర్‌ఎస్ గాలం విసిరింది. ఆపరేషన్ ‘ఆకర్ష్’ మొదలుపెట్టింది. ఈసారి ఖమ్మం కార్పొరేషనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ‘హస్తం’నేతలను ఆకట్టుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అనుకున్నట్టుగానే కొందరు మాజీ కౌన్సిలర్లను గులాబీ గూటికి లాగుతోంది. ‘శీలంశెట్టి’ నుంచి మొదలైన ఈ ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్తుందో... మంత్రి తుమ్మల రాజకీయ చాణక్యం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..
- కార్పొరేషన్ దక్కించుకోవడమే లక్ష్యం!
- పావులు కదుపుతున్న మంత్రి తుమ్మల
- టీఆర్‌ఎస్ గూటికి మాజీ కౌన్సిలర్లు
- పార్టీ తీరుతోనే ఫిరారుుంపులట!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌ను దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నగరంలో బలహీనంగా ఉన్న టీఆర్‌ఎస్ బలోపేతం దిశగా ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లను తనవైపు ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మాజీ కౌన్సిలర్, డీసీసీ ఉపాధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రంను గురువారం గులాబీ గూటికి చేర్చుకుంది. ఆయనతోపాటు మరికొందరు ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు గులాబీ బాట పట్టనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు, ప్రజాప్రతినిధుల విధానాలు నచ్చకనే బయటకు వెళ్తున్నట్లు పార్టీ ఫిరారుుస్తున్న నేతలు చెబుతుండటం చర్చనీయూంశంగా మారింది.
త్వరలో జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అధికార పార్టీ హోదాలో ఉండి.. పార్టీ పరంగా బలం లేకున్నా ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో జెండా ఎగురవేయాలన్న ఆలోచనతో టీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం మినహా జిల్లాలో ఎక్కడా టీఆర్‌ఎస్ సత్తా చాటలేకపోయింది. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం.
పైకి నేతలే పార్టీలో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కేడర్ లేకపోవడంతో అప్పట్లో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతాయని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బలం లేని ఖమ్మం నగరంలో బలోపేతంపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న నేతలు కార్పొరేషన్ బరిలో నిలిచేందుకు సరిపోరన్న ఉద్దేశంతో ఇతర పార్టీ మాజీ కౌన్సిలర్లు, నేతలకు ఎరవేసేందుకు సిద్ధమయ్యూరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ చతికిలపడింది. అధికారంలో ఉండి కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటకపోతే నేతలుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్న తమ ప్రతిష్ట గంగలో కలుస్తుందన్న భావనతో ఆ పార్టీ ఈ తతంగానికి తెరతీసింది.
దీని దృష్ట్యానే కాంగ్రెస్ పార్టీ నుంచి పలుమార్లు కౌన్సిలర్లుగా విజయం సాధించి, డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న శీలంశెట్టి వీరభద్రంను గులాబీ గూటికి చేర్చడంలో సఫలమైంది. ఆయనతోపాటు మాజీ కౌన్సిలర్లు గుంటి మల్లయ్య, గాదె భాస్కర్, బెడదం సత్యనారాయణ, గుంటి అరుణ, నేతలు తేజావత్ శ్రీను, ఆర్. రాము, కుమ్మరి గురుమూర్తి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాజధానిలోని తెలంగాణ భవన్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
పార్టీలో నేతల తీరు నచ్చక.. భవిష్యత్‌పై ఆందోళనతోనే సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడినట్లు సమాచారం. ఒంటెత్తు పోకడలతో తొలి నుంచి జెండా మోసిన వారికి పదవులు దక్కకుండా ఇటీవల వచ్చిన వారికే పీట వేస్తున్నారన్న ఆగ్రహంతో సదరు నేతలు కాంగ్రెస్‌పార్టీకి దూరమైనట్లు చర్చ జరుగుతోంది.
దారికి రాకుంటే నయానో..భయానో..
పదవులు, నజరానాలు ఆశ చూపుతూ మరికొందరు మాజీ కౌన్సిలర్లు, వార్డుల్లో బలంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దారికి రాని వారికి నయానో..భయానో నచ్చచెప్పి తమ దారికి తెచ్చుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి త్వరలో ఖమ్మం నగరంలో పర్యటించనున్నట్టు సంకేతాల నేపథ్యంలో ఆయన సమక్షంలోనే జిల్లాకేంద్రంలో కొంతమంది మాజీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చాలన్న దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న నేతలు మాత్రం తమను కాదని ఇప్పటికే ఇటీవల వచ్చిన వారిని భుజానికెత్తుకోవడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు దక్కకున్నా కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా కార్పొరేటర్‌గా బరిలో దిగుదామనుకుంటున్న వారి ఆశలు కొత్త నేతల రాకతో అడియాసలు అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాత నేతలంతా కార్పొరేషన్ ఎన్నికల సమయానికి తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. ఉద్యమ జెండాను మోయకుండా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారికి పదవులు, ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు.
కాంగ్రెస్‌లో కలవరం
ఇప్పటి వరకు టీడీపీపై కన్నేసిన టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లకు వల వేయడంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. నగరంలో పరిస్థితి చేయి దాటిపోతే కార్పొరేషన్ గోల్ కొట్టడం సాధ్యం కాదని పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఓ వైపు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ కౌన్సిలర్లు, నేతలను గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ డీసీసీ కార్యాలయానికి పిలిపించుకుని వారితో మంతనాలు జరిపారు.
పార్టీని వీడవద్దని, రానున్న ఎన్నికల్లో మనదే పై చేయి అవుతుందని వారికి హితబోధ చేశారు. అయితే మరికొందరు కౌన్సిలర్లు, నేతలు కూడా గుట్టుచప్పుడు కాకుండా టీఆర్‌ఎస్ నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నారన్న సమాచారంతోనే ఎమ్మెల్యేలు ఈ చర్చకు దిగారు. అయినా ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ‘చేయి’ ఇస్తారోనని, కార్పొరేషన్ బరిలో నిలవడం ఎలా అన్న హైరానాలో ఆ పార్టీ నేతలున్నారు.