అదో కాలువ.. దానికి అనుబంధంగా డ్రైనేజీలు, వానాకాలం వచ్చిందంటే ఉప్పొంగడం, రోడ్లన్నీ మురికినీటితో నిండిపోవడం, విషజ్వరాలు, తాగునీటి కాలుష్యం, దుర్వాసన.. ఇదంతా గతం.. ఇప్పుడు అదంతా అందాల హరివిల్లు. పచ్చదనం నిండిన పార్కులు, ఫౌంటెయిన్‌లు, ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలతో ఆహ్లాదం పంచే ప్రదేశం.. ఖమ్మం పట్టణంలోని గోళ్లపాడు చానెల్,దాని వెంట ఉన్న ప్రాంతాల్లో వచ‍్చిన అద్భుతమైన మార్పు ఇది. సీఎం కేసీఆర్ హామీ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ కలిసి రూ.100 కోట్ల ఖర్చుతో గోళ్లపాడు చానెల్ ప్రాజెక్టు అపూర్వంగా రూపుదిద్దుకుంది. సీఎం కేసీఆర్ ఈ అభివృద్ధి పనులకు కితాబివ్వగా.. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
- రూ.100 కోట్లతో 10.6 కి.మీ.పొడవునాఅభివృద్ధి
- గోళ్లపాడు చానల్ పునరుద్ధరణతో ఖమ్మం పట్టణానికి వన్నె
- ఆక్రమణలకు పాల్పడిన 862 మందికి పునరావాసం
- మంత్రి పువ్వాడ చొరవతో పనులు.. త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
గోళ్లపాడు చానల్ ఖమ్మం నగరం మీదుగా వెళ్తూ.. శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరందించేది. త్రీటౌన్ ప్రాంతంలో 10.6 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ కాల్వ కాలక్రమేణా నగరాభివృద్ధితో డ్రైనేజీగా మారింది. పంపింగ్ వెల్ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో కాల్వకు ఇరువైపులా బస్తీలు వెలిశాయి. ఖమ్మం నగరంలోని 28 డివిజన్ల మురికినీరంతా ఈ కాల్వ నుంచే వెళ్లి మున్నేరులో కలుస్తుండటం, ఆక్రమణలు, సిల్ట్ తీయకపోవడంతో నాలుగు దశాబ్దాలుగా కాల్వ, పరిసర ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. వానాకాలంలో ఈ డ్రైనేజీ పొంగి సమీప డివిజన్లలో మురికినీరు చేరడం, ఆ నీరు పైపులైన్లలో కలిసి తాగునీరు కలుíÙతం కావడం నిత్యకృత్యమైంది. దోమల స్వైర విహారంతో విషజ్వరాలు, వ్యాధుల విజృంభణ సాధారణమైంది.
రూ.100 కోట్లతో మారిన ముఖచిత్రం
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లతోపాటు ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి 2018లో ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగా రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 30ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాన నీరు వెళ్లేందుకు ఓపెన్ కాల్వ నిర్మించడంతోపాటు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైభాగంలో ఆహ్లాదం పంచేలా పార్కులను ఏర్పాటు చేశారు.
అధునాతన సౌకర్యాలతో..
పది డివిజన్ల పరిధిలోని 50 వేల మంది ప్రజలకు ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్‌ను అభివృద్ధి చేశారు. పిల్లలకు చెస్‌పై అవగాహన కలి్పంచేలా రష్యాలోని మాస్కో తరహాలో మెగా చెస్‌బోర్డులు, అధునాతనంగా స్కేటింగ్ రింక్‌లు, వాటర్ ఫౌంటెయిన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, బస్తీ దవాఖానా, యోగా వేదికలు, పంచతత్వ పార్కులు, 10 వేల ఔషధ, ఇతర మొక్కలతో మినీ పార్కులను ఏర్పాటు చేశారు. మొత్తం 32 ఎకరాల స్థలం ప్రజా అవసరాల దృష్ట్యా వినియోగంలోకి వచ‍్చింది.
గోళ్లపాడు చానల్ ప్రాజెక్టు వ్యయం రూ.100 కోట్లు అయితే.. వినియోగంలోకి వచ్చిన భూమి విలువ రూ.300 కోట్లకు పైమాటేనని అంచనా వేశారు. సీఎం సూచనల మేరకు ఇటీవల నిజామాబాద్ కలెక్టర్, ఆ జిల్లా అధికారులు ఈ అభివృద్ధి పనులను సందర్శించారు కూడా. గోళ్లపాడు చానల్‌పై నిర్మించిన పార్కులకు ప్రొఫెసర్ జయశంకర్, మంచికంటి రామకిషన్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, రజబ్ అలీ, వనజీవి రామయ్య తదితరప్రముఖుల పేర్లను పెట్టారు. గోళ్లపాడు చానల్ వెంట గతంలో గుడిసెలు, ఇతర తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న 862 మంది పేదలకు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో
ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్ని వసతులతో కాలనీ ఏర్పాటు చేశారు.
మురికి పోయి.. వన్నె వచ‍్చింది
సీఎం కేసీఆర్ రూ.100 కోట్లను గోళ్లపాడు చానల్‌కు కేటాయించడంతో నాలుగు దశాబ్దాల మురికి కూపం నుంచి విముక్తి కలిగింది. వన్నె వచ‍్చింది. ప్రత్యేకంగా త్రీటౌన్ ప్రాంతానికి ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్ ముస్తాబైంది. విషజ్వరాలు, దుర్వాసనతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నేడు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. సీఎం దార్శనికతకు ఇది నిదర్శనం.- పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి
అందరి కృషితో ఆహ్లాదం
సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులు, స్థానికుల సహకారంతో గోళ్లపాడు చానల్ సొబగులు అద్దుకుంది. ఆహ్లాదకరమైన పార్కులు
అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వీటిని సదినియోగం చేసుకోవాలి. మొత్తం పది వేల కుటుంబాలు ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా తీర్చిదిద్దాం. గోళ్లపాడు చానల్ పార్కుల్లో ఇంకా కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. -వీపీ గౌతమ్, కలెక్టర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment