కరువు ప్రాంతాలు ప్రకటిస్తాం
శాసనమండలిలో మంత్రి పోచారం ప్రకటన
- రూ.1,500 కోట్ల వరకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాం
- రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 93,500 అప్పు ఉంది
- నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు అఖిలపక్షం నిర్వహిస్తాం
- వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: త్వరలో కరువు ప్రాంతాలను ప్రకటించి ప్రభుత్వమే ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1,500 కోట్ల మేరకు రైతుకు సాయంగా అందిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. 200కు పైగా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. శాసనమండలిలో గురువారం ఆయన రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. త్వరలో మిగిలిన సగం రుణమాఫీని ఏకమొత్తంగా చెల్లించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని, చెల్లింపును వచ్చే ఏడాది వరకు సాగదీయబోమని స్పష్టంచేశారు. బ్యాంకుల్లో రుణం రెన్యువల్ చేసుకోని రైతుల డాక్యుమెంట్లను వెనక్కిచ్చే ఏర్పాట్లు చేస్తామని, వసూలు చేసిన వడ్డీని తిరిగి రైతులకిచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
బోగస్ రుణాలు పొందిన వారిని ప్రోత్సహించవద్దని చెప్పారు. ‘700 మంది ఓటర్లున్న మా గ్రామంలోనే 500 మంది బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారు. అలాగే నా నియోజకవర్గంలో రూ. 9 కోట్ల రుణాలు బినామీల ఖాతాల్లోకి వెళ్లాయి’ అని పోచారం ఉదహరించారు. దేశంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 47 వేల అప్పుంటే, తెలంగాణలో రూ. 93,500 అప్పు ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
నల్లబెల్లం విక్రయాలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో వెయ్యి ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పశువుల వైద్యం కోసం 36 డివిజన్లలో శుక్రవారం నుంచి మొబైల్ వెటర్నరీ వ్యాన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 108, 104 మాదిరి ఇవి పనిచేస్తాయన్నారు. రైతులు తమ పశువుల అనారోగ్యంపై ఫోన్ చేసిన వెంటనే మొబైల్ వ్యాన్ సంబంధిత గ్రామానికి వెళ్తుందని పోచారం పేర్కొన్నారు.
వెంటనే ఎందుకు స్పందించలేదు?
రైతు ఆత్మహత్యలపై సర్కారు వెంటనే స్పందించలేదని మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమవుతుందన్న భయంతోనే సర్కారు ఇప్పుడు హడావుడి చేస్తోందే తప్ప.. రైతులపై ప్రేమతో కాదన్నారు. మొదట్లోనే భరోసా ఇచ్చి ఉంటే వెయ్యి మందికిపైగా రైతుల ఆత్మహత్యలు ఆగేవన్నారు. గత ఏడాది 337 మండలాల్లో లోటు వర్షపాతం ఉంటే, కేంద్రానికి కరువు మండలాల జాబితాను పంపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెద్దగా కరువులేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందని వివరించారు. ఈ పరిస్థితుత్లో రబీలో రైతుకు ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు.
ప్రైవేటు అప్పులపై రెండు మూడేళ్లు మారటోరియం ప్రకటించాలన్నారు. ఎప్పటిలోగా రుణమాఫీ సొమ్ము చెల్లిస్తారో నిర్ణీత తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించాలన్నారు. నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలన్నారు. కేంద్రం నుంచి రూ. 10 వేల ప్రత్యేక ప్యాకేజీ సాధించాలన్నారు. ఈ చర్చలో బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు కూడా మాట్లాడారు.