రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల రాద్ధాంతం
బాన్సువాడ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధిపొందడానికే టీడీపీ, కాంగ్రెస్‌లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు., సోమవారం ఆ పార్టీలు పిలుపునిచ్చిన మెదక్ జిల్లా బంద్ పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభం నుంచి జూలై 24 వరకు ప్రాణహిత, ఇందిరావతి నదుల నుంచి 770 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని తెలిపారు. ఈ నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలోని కొంత భాగంలో గల 3,000 గ్రామాల్లోని 40 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 45 సార్లు నిండుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి 40 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కాగా, వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 65 లక్షల ఎకరాల్లోనే పంటలను వేసారని తెలిపారు. 25 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా, 3.40 లక్షల ఎకరాల్లో వేశారని తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులతో జీవో నెంబర్ 123 ప్రకారం ముఖాముఖిగా మాట్లాడి నష్ట పరిహారం చెల్లించడం, లేదా 2013 పార్లమెంట్ బిల్లు ప్రకారం చెల్లంచడంపై వారితోనే అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. జీఓ 123 ప్రకారం వారు ఒప్పుకోగా, మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ. 6 లక్షలు, పొలాల్లో ఉండే నిర్మాణాలు, బోర్లకు అదనంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యామని, దీనికి ఏటిగడ్డ, కిష్టాపూర్ గ్రామస్తులు అంగీకరించారని తెలిపారు. ఎవరో టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డి, సొంత లబ్దికోసం మిగితా గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేస్తూ, పోలీసులపై రాళ్లు రువ్వారని, ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు. మేధావి అయిన ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కాంగ్రెస్ నేతలు దీన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాణహిత–చేవేళ్ల పథకం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు లభించాయా అని మంత్రి పోచారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించడమే ధ్యేయంగా కాళేశ్వరం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. గోదావరి, మంజీర నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు అక్రమ ప్రాజెక్టులను నిర్మించడంతో నేడు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. కాళేశ్వరంతోనే ఈ ప్రాజెక్టులకు జీవం పోయడానికి వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు.