వచ్చే నెల జిల్లాకు సీఎం
♦ 1,2 తేదీల్లో కేసీఆర్ పర్యటన
♦ బీర్కూర్‌లోని టీటీడీ ఆలయాన్ని దర్శించుకుంటారు
♦ విలేకరులతో మంత్రి పోచారం
బీర్కూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేనెల 1, 2 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం బీర్కూర్‌లోని టీటీడీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 1న బాన్సువాడలోని తన స్వగృహంలో బసచేసి, 2న బీర్కూర్‌లోని టీటీడీ ఆలయాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆలయవార్షిక బ్రహ్మోత్సవాలకు రాలేకపోతున్నారని మంత్రి తెలిపారు.
పరిపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
సమగ్ర ప్రణాళిక-పరిపూర్ణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీర్కూర్‌లోని టీటీడీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకా రం చుడుతూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. గతంలో మూస పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం భిన ్నంగా ఆలోచించి ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించి కొత్తరాష్ట్రంలో ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, ఎక్కడ తగ్గించాలి అని విశ్లేషించి చక్కటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నా రు.
సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు కేటాయిం చారని ఇలా నాలుగేళ్లలో సుమారు రూ. లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసారి వైద్యం కోసం ప్రత్యేకంగా రూ. 5 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. సీఎంతో పాటు ప్రతి మంత్రి వద్ద రూ. 25 కోట్లు స్పెషల్‌ఫండ్ కింద పెడుతున్నార న్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌కు రూ. 10 కోట్లు, ఎస్పీకి రూ. కోటి స్పెషల్ ఫండ్ ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 85 కోట్లతో నిజాంసాగర్ డీసీలు మరమ్మతులు చేయించామని, ఈసారి బడ్జెట్‌లో మరో రూ. 46 కోట్లు మంజూరు చేయించాని చెప్పారు.
ఈసారి బడ్జెట్‌లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 1 నుంచి 82 వరకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 220 కోట్లు కేటాయించిందన్నారు. మద్నూర్, సిర్పూర్ మీదుగా పోతంగల్ కోటగిరి నుంచి రుద్రూర్ బోధన్ మీదుగా నిజామాబాద్ వరకు జాతీయ రహదారి మంజూరయిందని పేర్కొన్నారు. దీంతో పాటు బాలానగర్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు నేషనల్ హైవే పనులు కూడా చేపడతామని చెప్పారు. సమావేశంలో కోటగిరి ఎంపీపీ సులోచన, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, నాయకులు ద్రొణవల్లి సతీశ్, పెర్క శ్రీనివాస్, అప్పారావు, మహ్మద్ ఎజాస్, కొత్తకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.