ప్రతిఇంటికి సురక్షిత మంచినీరు
పుల్‌కల్/పెద్దశంకరంపేట: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. 2017 మార్చిలోగా 275 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ముందుగు సాగుతున్నామని చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా పుల్‌కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట శివారులో జరుగుత్ను భగీరథ పనుల పరిశీలన, పెద్దశంకరంపేట మండలం జంబికుంట నుంచి నిజామాబాద్ జిల్లాకు నిర్మిస్తున్న తాగునీటి పైప్‌లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.75 లక్షల కిలోమీటర్ల మే పైప్‌లైన్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో 26 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. రూ.1,350 కోట్లతో సింగూరు- జూకల్, రూ.1400 కోట్లతో శ్రీరాంసాగర్- కామారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
సింగూర్-జూకల్ ప్రాజెక్టును నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. జూకల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు బోధన్ ప్రాంతానికి ఈ పైప్‌లైన్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు రెండు ప్యాకేజీల ద్వారా రూ. 1000 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు ఉన్నారు.