సిటీలో చోరీ... వైజాగ్ లో జల్సా | threft in hyderabad enjoying in vizag | Sakshi
Sakshi News home page

సిటీలో చోరీ... వైజాగ్ లో జల్సా

Published Tue, Jun 14 2016 2:07 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

సిటీలో చోరీ... వైజాగ్ లో జల్సా - Sakshi

సిటీలో చోరీ... వైజాగ్ లో జల్సా

పోలీసుల అదుపులో గజదొంగ
ఎట్టకేలకు చిక్కిన సినార్‌వ్యాలీ నిందితుడు?

 హైదరాబాద్: కిటికీ గ్రి ల్స్ తొలగించి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠా ణా పరిధిలో మూడేళ్లుగా భారీ చోరీలకు పాల్పడుతున్న ఓ గజదొంగ ఎట్టకేలకు నల్లగొండ పోలీసులకు చిక్కాడు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకొని రెండు రోజులుగా విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... వైజాగ్‌కు చెందిన కర్రి సతీష్(27) గత ఏప్రిల్ 28న ఫిలింనగర్  సినార్‌వ్యాలీలో నివాసం ఉండే ప్రముఖ రియల్టర్ ఎస్‌ఎస్ శర్మ ఇంటి గ్రిల్ తొలగించి రూ. కోటి విలువ చేసే బంగారు నగలతో పాటు రూ. 5 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు.

ఘటనా స్థలంలోగాని, సీసీ కెమెరాల్లో గాని తనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడి పోలీసులకు ఇతగాడు సవాల్ విసిరాడు. ఒకవైపు నగర పోలీసులు సతీష్ కోసం గాలిస్తుండగా.. మరో వైపు నల్లగొండలో కారు దొంగతనం చేశాడు. దానిని కొన్నిరోజులు వాడుకొని వదిలేశాడు. అయితే, ఆ కారులో అతడు మర్చిపోయిన చిన్న స్లిప్ ఆధారంగా పోలీసులు పట్టేశారు. విచారణలో ఇతను బంజారాహిల్స్ ఠాణా పరిధిలో 13 చోరీలకు పాల్పడినట్టు తేలింది.

టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంట్లో కారుతో పాటు మరో నాలుగు ఖరీదైన కార్ల దొంగతనం కేసులోను, జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో రెండు చోరీ కేసుల్లోనూ నిందితుడు అని తేలింది. ఆర్కిటెక్ట్ రవి ఇంట్లో రూ.7 లక్షల దొంగతనం, జర్నలిస్టు కాలనీలో రమేష్‌బాబు నివాసంలో 16 తులాల ఆభరణాలు చోరీ ఘటనలోనూ సతీష్ నిందితుడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  ఇంకో రెండు రోజులు నిందితుడిని విచారిస్తే మరిన్ని చోరీ కేసులు ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 తెరిచి ఉన్న ద్వారంలోంచి వెళ్లడు...
నిందితుడు సతీష్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చోరీ చేసిన కారులో కొన్ని రోజులు షికారు చేస్తాడు. మోజు తీరాక.. దాని యజమాని ఇంటి సమీపంలో వదిలివెళ్లిపోతాడు. అలాగే.. చోరీకి వెళ్లినప్పుడు ఆ ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉన్నా.. అందులోంచి మాత్రం వెళ్లడు. కిటికీ గ్రిల్స్ తొలగించి దానిలోంచి మాత్రమే ఇంట్లోకి చొరబడడం ఇతడి స్టైల్  అని పోలీసులు తెలిపారు.

 చదివింది నాలుగో తరగతి..
గజదొంగగా పోలీసులు పేర్కొంటున్న సతీష్ చదివింది నాల్గవ తరగతి. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో వైజాగ్‌లో జల్సాలు చేస్తున్నట్టు తేలింది. ఖద్దరు దుస్తులు ధరించి, ఖరీదైన కార్లతో తిరుగుతూ స్టార్ హోటళ్లలో గడుపుతూ  వైజాగ్‌లో పెద్ద మనిషిలా చెలామణి అవుతున్నట్లు కూడా విచారణలో తేలింది.

గతంలో ఓ చోరీ కేసులో వైజాగ్ పోలీసులకు చిక్కి జైలుకెళ్లి వచ్చాడు. వైజాగ్‌లో చోరీ చేసిన సొత్తును విక్రయించి పటాన్‌చెరులో భూములు కొనగా.. రికవరీలో భాగంగా వైజాగ్ పోలీసులు ఆ భూమిని విక్రయించి బాధితులకు చెల్లించి నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement