తిరుపతికి స్వచ్ఛ కిరీటం
⇒దేశంలో 9వ ర్యాంకు కైవసం
⇒చిత్తూరుకు 71, శ్రీకాళహస్తికి 119
⇒అట్టడుగున మదనపల్లె
⇒ ఢిల్లీలో ‘తిరునగరి’ అవార్డు అందుకున్న అధికారులు
చిత్తూరు (అర్బన్), తిరుపతి తుడా: తిరుపతి అరుదైన గౌరవం దక్కించుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2017 అవార్డుల్లో నగరం 9వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీ నేషనల్ మీడియా సెంటర్‌లో గురువారం స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకులను కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి పి.ఎస్. ప్రద్యుమ్న,కార్పొరేషన్ పూర్వపు కమిషనర్ వినయ్‌చంద్, సెక్రటరీ బాలస్వామి, ఈ అవార్డును కేంద్రమంత్రి నుంచి అందుకున్నారు. నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత ఎలా పాటిస్తున్నారో తెలుసుకోవడానికి రెండేళ్లుగా కేంద్రం ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట పోటీలు పెడుతోంది.
దేశంలోని ఉత్తమ ర్యాంకులు సాధించిన నగరాలు, పట్టణాలకు అవార్డులు ఇవ్వడం, సుందరీకరణకు నిధులు విడుదల చేస్తోంది. ఈ ఏడాది జిల్లా నుంచి రెండు కార్పొరేషన్లు, రెండు మునిసిపాలిటీలు పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా 434 పట్టణాలు పాల్గొనగా మన జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాలిటీలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రాథమిక అర్హత సాధించాయి. తిరుపతి జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు అందుకోగా చిత్తూరు 71, శ్రీకాళహస్తి 119, మదనపల్లె 281వ స్థానాల్లో నిలిచాయి.
ఇవీ ప్రమాణాలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (బహిరంగ ప్రాంతాల్లో మల మూత్రాల విసర్జన నిషేధం), ఆన్‌లైన్, ఫోన్ల ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం, క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించే అంశాలను పొందుపరిచారు. ఈ నాలుగు అంశాలకు 2,000 మార్కులు కేటాయించారు. తిరుపతికి 1,704 మార్కులు రావడం విశేషం. కాగా మదనపల్లె మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచింది.