టీఎంయూ జయకేతనం
ఐదు డిపోల్లో గెలుపు ఒక్క డిపోలో ఈయూ విజయం
జిల్లాలో మంగళవారం ఆర్టీసీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.. నిజామాబాద్ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హవా కొనసాగింది.. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా.. ఐదింటిలో టీఎంయూ.. ఒక్క డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విజయం సాధించాయి.. నిజామాబాద్ డిపో-1, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌లలో టీఎంయూ.. నిజామాబాద్ డిపో-2లో మాత్రం ఈయూ విజయకేతనం ఎగురవేసింది.. ఈ సందర్భంగా కార్మికులు బాణాసంచా కాల్చుతూ.. రంగులు చల్లుకుంటూ విజయోత్సాహం నిర్వహించారు..
నిజామాబాద్‌నాగారం : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) సత్తా చాటింది. జిల్లాలో ఆరింటిలో ఐదు డిపోల్లో జయకేతనం ఎగురవేసింది. ఒకదాంట్లో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది.
నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌లో 6 డిపోలు ఉన్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 3,064 ఓట్లుండగా 3,002 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 97గా నమోదైంది. టీఎంయూ, ఈయూల మధ్యే ప్రధాన పోటీ సాగింది. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా సంఘాలు చర్యలు తీసుకున్నాయి. అనారోగ్యంతో ఉన్న కార్మికులను ఆటోలు, జీపులు, బైక్‌లపై పోలీంగ్ కేంద్రాలకు తరలించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేశారు.
నిజామాబాద్ డిపో-1, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌లలో టీఎంయూ గెలుపొందింది. నిజామాబాద్ -2 డిపోలో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది. రీజియన్‌లో 3,064 ఓట్లు ఉండగా 3,002 ఓట్లు పోలయ్యాయి. టీఎంయూ 1,733 ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. బాన్సువాడ డిపోలో ఒక ఓటు విషయంలో రీకౌంటింగ్ నిర్వహించారు. మిగతా అన్ని డిపోల్లో అంతా ప్రశాంతంగా లెక్కింపు పూర్తి అయ్యింది. క్లాస్-3 రాష్ట్రానికి సంబంధించి పూర్తి మెజారిటీ సాధించింది. రీజీయన్ స్థాయి క్లాస్-6లో డిపో-2లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో టీఎంయూ గెలిచింది.
25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్..
దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన మిగతా 62 మంది కార్మికులు తమ ఓటు హక్కును ఈ నెల 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన వినియోగించుకోవచ్చునని డిప్యూటీ లేబర్ కమిషనర్ చతుర్వేది తెలిపారు. వీరి ఓట్లను లెక్కించి సీల్డ్ కవర్‌లో రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. వాటి వివరాలను వచ్చేనెల 8న ప్రకటిస్తారన్నారు.
డిపోల్లో సంబురాలు..
అన్ని డిపోల్లో కార్మికుల సంబురాలు అంబరాన్నింటాయి. ఐదు డిపోల్లో టీఎంయూ, ఒక డిపోలో ఈయూ సంబురాలు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.