కళాశాలకు రావాలంటే బెంబేలు
- ఈ గదులు మాకొద్దు సారూ..
- శిథిలమైన కళాశాల భవనం
- ఎప్పుడు కూలుతుందో తెలియదు
- బెంబేలెత్తిపోతున్న విద్యార్థులు
- తరగతుల బహిష్కరణ
- చెట్ల కిందే కూర్చున్న విద్యార్థులు
కళాశాలకు రావాలంటేనే విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. శిథిల భవనంలోనే తరగతులు కొనసాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో భవనం పైకప్పు కొద్దికొద్దిగా కూలుతుంది. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూలే గదులు మాకొద్దంటూ చెట్ల కిందే కూర్చుంటున్నారు అల్లాదుర్గం జూనియర్ కళాశాల విద్యార్థులు.
అల్లాదుర్గం
2001లో అల్లాదుర్గానికి జూనియర్ కళాశాల మంజూరైంది. భవనం లేకపోవడంతో అప్పట్లో ప్రభుత్వం పాఠశాలలో షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహించారు. జెడ్పీహెచ్‌ఎస్‌కు సొంత భవనం నిర్మించడంతో పాత భవనంలో కళాశాల కొనసాగుతోంది. పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పైకప్పు పడుతుంది. గత ఏడాది ఇద్దరు విద్యార్థులపై పడటంతో గాయాలయ్యాయి. మూడు రోజులుగా వర్షాలు కరుస్తుండటంతో భవనం పైకప్పు కూలిపోతుంది.
దీంతో విద్యార్థులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. బుధవారం అదే భవనంలో తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించి చెట్ల కింద కూర్చున్నారు. చెట్ల కింద తరగతులు నిర్వహించకుండా లెక్చరర్లు కార్యాలయంలోనే కూర్చుండిపోయారు. ప్రిన్సిపాల్ తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల భవనంలో షిప్టు పద్ధతిలో కాలేజీ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల ¿భవనంలో షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
భయంగా ఉంది..
కాలేజీ భవనం శిథిలావస్థకు చేరింది. రోజూ పైకప్పు కూలి పడుతుంది. ఎప్పుడు ప్రమాదం ముంచుకోస్తుందోనని భయపడుతున్నాం. వర్షం పడితే చాలు గదుల్లో నీరు నిండుతుంది.
లతీఫ్, విద్యార్థి
షిప్టు పద్ధతిలో కొనసాగించాలి..
కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాలను షిప్టు పద్ధతిలో కొనసాగించాలి. పాత భవనంలో కూర్చునే ప్రసక్తే లేదు. చదువు కోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
రవీందర్, విద్యార్థి