ప్రజా పంపిణీపై పక్కా నిఘా
♦ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు విజిలెన్స్ కమిటీల ఏర్పాటు
♦ పనితీరుపై ప్రతినెలా సమావేశాలు
♦ సరుకుల పక్కదారిపై కన్ను..
♦ పారదర్శకతకు పెద్దపీట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తున్న సరుకులు పక్కదారి పట్టకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు కానుంది. అంతేగాక సరుకుల అందజేతలో అత్యంత పారదర్శకత రానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫలితంగా రూ.కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సర్కారు నడుంబిగించింది. పంపిణీ వ్య వస్థపై డేగకన్ను వేసేందుకు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువా రం పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు కమిటీలు రూపుదిద్దుకోనున్నాయి. కమిటీలు ఏర్పాటు చేసే బాధ్యతల్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించింది.
అక్రమాలకు చెక్...
దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు అందజేస్తున్న బియ్యం, కిరోసిన్ జిల్లాలో పెద్ద ఎత్తున పక్క దారి పడుతున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి మొదలుకొని రేషన్ షాపుల వరకు అన్నిచోట్ల అక్ర మాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నీలి కిరోసిన్ ... వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. లారీల యజమానులు పెద్ద ఎత్తున మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పేదలకు అందా ల్సిన కిరోసిన్ కోటాలో దాదాపు 50 శాతానికిపైగా పక్కదారి పడుతున్నట్లు అధికారిక వర్గాలే వెల్లడిస్తు న్నాయి. మరోపక్క సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
హాస్టళ్ల వార్డన్ల సహకారంతో... గుట్టుచపు్పడు కాకుండా మార్కెట్లోకి తరలుతున్నా యని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కిలో సన్నబియ్యం ధర బహిరంగ మార్కెట్లో రూ. 40కిపైగా ఉండడంతో.. వీటికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. హాస్టళ్లకు ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో.. వార్డెన్ల కు భారీగా గిట్టుబాటు అవుతోందని తెలుస్తోంది. వీటితోపాటు రేషన్ డీలర్లు హస్తలాఘవాన్ని ప్రదర్శి స్తున్నారు. కార్డుదారులకు అందించాలి్సన యూనిట్లలో కొంత కోత విధిస్తున్నారు. ఆ మేరకు వెనకేసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని రేషన్ దుకాణాల్లో ఇటువంటì ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో సైతం తేలింది.
ఈ–పాస్ విధానంలోని కొన్ని లోటుపాట్లు డీలర్లకు కలిసి వస్తున్నాయి. అక్రమాల గురించి తెలుసుకున్న అధికారులు తనిఖీలకు వెళితే.. డీలర్లు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు. అక్రమాల వెలికితీతను అడ్డుకునేందుకు మంత్రులతోనూ అధికారులకు ఫోన్లు చేయించిన దాఖలాలు అధికంగానే ఉన్నాయి. కష్టపడి తనిఖీలు చేసినా.. కళ్లముందు అక్రమాలు జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. పైగా తమను డీలర్లు లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. విజిలెన్స్ కమిటీల ఏర్పాటు ద్వారా ఇకపై ఇటువంటి ఆగడాలకు చెల్లుపడునుందని అధికారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కమిటీల ఏర్పాటు ఇలా...
కలెక్టర్ నేతృత్వంలో జిల్లా, మున్సిపాలిటీ, మండల, గ్రామపంచాతీ స్థాయి విజిలెన్స్ కమిటీలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో వినియోగదారులు, మానవ హక్కులు, సామాజిక సేవ, ఆరోగ్యం తదితర రంగాల్లోని వ్యక్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా, జెడ్పీ చైర్ పర్సన్ .. కో చైర్ పర్సన్ గా, జేసీ ఉప చైర్‌పర్సన్ గా, కన్వీనర్‌గా జిల్లా సరఫరాల అధికారి వ్యవహరిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులకు చోటు కల్పిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నుంచి ఇద్దరిని కలెక్టర్ నామినేట్ చేస్తారు. మండల స్థాయి కమిటీకి చైర్ పర్సర్‌గా ఆర్‌డీఓ, కన్వీనర్‌గా తహసీల్దార్, గ్రామపంచాయతీ స్థాయి కమిటీలకు చైర్ పర్సన్ గా సర్పంచ్, కన్వీనర్‌గా వీఆర్‌ఓ వ్యవహరిస్తారు. మహిళా సంఘాల సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎస్టీ,ఎస్టీ కేటగిరీల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు.
చర్చ.. చర్యలు.. నివేదిక
అన్ని స్థాయిల కమిటీలు ప్రతినెలా సమావేశం అవుతాయి. గ్రామపంచాయతీ స్థాయి కమిటీ ప్రతినెలా తొలి సోమవారం, రెండో సోమవారం మండల స్థాయి కమిటీ, నాలుగో సోమవారం జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశమై ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాల్సి ఉంటుంది. సరుకుల కేటాయింపు, కార్డుదాలరుకు పంపిణీ, స్టాక్‌పై పరిశీలన, సరుకుల సరఫరా తీరు, డబ్బుల చెల్లింపులు, ఫిర్యాదులు, అక్రమాలు, కార్డుల స్థితి, బోగస్ కార్డుల ఏరివేత, ఖాళీ రేషన్ షాపుల డీలర్ల భర్తీ, బియ్యం సేకరణ, అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. తీసుకున్న చర్యలపై ఎప్పటికపు్పడు నివేదక తయారు చేయాలి. ఇలా ప్రతి చర్యపై నిఘా పెట్టడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు నిజమైన అర్హులకు సక్రమంగా సరుకులు పంపిణీ చేయవచ్చని భావిస్తోంది.
రేషన్ షాపులు 916
ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 35,550
ఆహార భద్రత కార్డులు 4.82 లక్షలు
ప్రతినెలా బియ్యం కోటా 11,025 మెట్రిక్ టన్నులు
చక్కెర కోటా 5.17 లక్షలు (అర కేజీ ప్యాకెట్లు)
కిరోసిన్ కోటా 300 కిలో లీటర్లు