పరామర్శించేందుకు తీరికలేదా?
మంత్రి కామినేనిపై ఎమ్మెల్యే ఈశ్వరి మండిపాటు
కొయ్యూరు: కిడ్నీ మరణాలతో కొయ్యూరు మండలంలోని దూసరి కొత్తూరు గ్రామం వల్లకాడుగా మారుతున్నా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు అక్కడి గిరిజనులను పరామర్శించేందుకు తీరుకలేదా అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. నర్సీపట్నం వరకు వచ్చిన కామినేనికి దానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు వచ్చేందుకు తీరిక లేకపోవడం దారుణమన్నారు. గిరిజన మరణాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తార్కణమన్నారు. గ్రామంలో 12 మంది వరకు మరణించినా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. మంగళవారం ఆమె కొత్తూరులో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఇంటి పెద్దలు కిడ్నీలు పాడై మరణించడంతో ఆ కుటుంబాలు వీధినపడ్డాయని.. ప్రతి కుటుంబానికి రూ.రెండు లక్షల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కిడ్నీ సంబంధిత రోగులకు ఉచిత వైద్యసేవలు అందించాలని సూచించారు. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్న కంఠారం వైద్యురాలు సునీతతో ఎమ్మెల్యే మాట్లాడారు. వెరుు్య మందిలో ఒకరికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే వీలుందని..ఇక్కడ ఎక్కువ మందికి కిడ్నీలు పాడైపోతున్నాయని, పురుషులు ఎక్కువగా చనిపోతున్నారని, ఇష్టానుసారంగా పెరుున్ కిల్లర్స్ వాడడంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని సునీత వివరించారు. అలాగే మహిళలు చనిపోవడంపై ఇటీవల ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల బృందం అన్ని కోణాల్లో పరిశీలన చేపట్టిందన్నారు. గ్రామంలో బోరుకు మోటారు అమర్చి రివర్స్ ఆజ్‌మసిస్(ఆర్‌వో)ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. తాండవ నీటిని ఇక్కడకు మోటారు ద్వారా తరలించి ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. కలెక్టర్ దృష్టిలో ఉంచి గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. మండల అధ్యక్షులు టీఎస్ రాందాస్, ముఖ్యకార్యకర్తలు జి.సత్తిబాబు, మామిడి రమణ, సీహెచ్ శ్రీను, కె రాంబాబు, గోవర్దనగిరి, సోమాగాంధీ పాల్గొన్నారు.