శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో టోర్నమెంట్ కోసం చేసిన ఏర్పాట్లు
– ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
– 1100 మంది క్రీడాకారులు పేర్ల నమోదు
తిరుపతి స్పోర్ట్స్: తిరుపతిలో తొలిసారిగా ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 11 మంది క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అండర్–17 బాల, బాలకలు, అండర్–19 బాల బాలికల విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలలో పోటీలు జరగనున్నాయి. శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలోని నాలుగు కోర్టులు, శ్రీపద్మావతీ మహిళా వర్సిటీలోని నాలుగు బ్యాడ్మింటన్ కోర్టుల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా బ్యాడ్మింటన్ అసోషియేషన్ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేశారు. మొయిన్ డ్రా టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారికి రూ. 3 లక్షలు క్యాష్ ప్రైజ్‌గా బహుమతి, మోమెంటోలను ఇవ్వనున్నట్లు అసోషియేషన్ కార్యదర్శి జయచంద్ర, కోశాధికారి రామకృష్ణ పేర్కొన్నారు. కోచ్‌లు, రెఫరీలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన 10మంది సీనియర్ క్రీడాకారులు విచ్చేశారు.