అల్పజీవుల అస్త్రం.. హర్తాళ్
పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా నేడు దేశవ్యాప్త నిరసన
మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్
విశాఖపట్నం: నల్ల కుబేరుల అణచివేతకేనన్నారు.. పెద్ద నోట్ల రద్దుతో మేలు జరుగుతుందన్నారు.. పెద్దలంతా సర్దుకోగా చిన్నవాళ్లకు అష్టకష్టాలు మిగిలాయి. బతుకులు రోడ్డునపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. మూడు వారాలు కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. అందుకే సోమవారం దేశవ్యాప్త హర్తాళ్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రతిపక్షాలు, వామపక్షాల నేతృత్వంలో సామాన్య ప్రజలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించనున్నారు.
నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఇరవై రోజులు. ఈ ఒక్క నిర్ణయం దేశ వ్యాప్తంగా పెనుసంచలనమవ్వడంతోపాటు జనానికి కష్టాలు మొదలయ్యారుు. కొద్ది రోజులే కదా సర్దుకుంటుంది అనుకున్నా సమస్య పెద్దదైంది తప్ప సద్దుమణగలేదు. ముందు చూపు లేకపోవడంతో ఏటీఎంలు మొరారుుస్తున్నారుు. నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో చిన్న వాళ్ల పనులు ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా 738 బ్యాంక్ బ్రాంచ్‌ల వద్ద జనం బారులుదీరారు. గంటలు, రోజులపాటు నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు నరకం చూస్తున్నారు. చివరికి ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే శుభకార్యాలు రద్దు చేసుకునే వరకూ వెళ్లింది. చిరు వ్యాపారాలు కుదేలయ్యారుు. సామాన్య మధ్యతరగతి వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది.
ఇదే అదనుగా కొందరు స్వార్ధ పరులు నోట్ల మార్పిడికి అడ్డ దారులు చూపిస్తామంటూ సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంక్‌లలో పాత నోట్లు అనుమతిస్తారన్నప్పటికీ చిల్లర లేకపోవడంతో అక్కడా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో స్పష్టత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. గడిచిన 20 రోజుల్లో ఒక్క నల్ల కుబేరుడైనా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డాడా అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనకు ప్రతీకగా నేడు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించనున్నారుు.