రాష్ట్రాల ‘వాటా’ ఇవ్వాల్సిందే | state share should be given | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల ‘వాటా’ ఇవ్వాల్సిందే

Published Sun, Sep 15 2013 1:31 AM | Last Updated on Tue, May 29 2018 3:48 PM

రాష్ట్రాల ‘వాటా’ ఇవ్వాల్సిందే - Sakshi

రాష్ట్రాల ‘వాటా’ ఇవ్వాల్సిందే

ఫైనాన్స్ కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ విజ్ఞాపన పత్రం
 కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాల వాటా బదలాయింపు అంశంపై మా అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించినపద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారికి, సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.  మా విజ్ఞాపన పత్రం ఈ విషయానికి సంబంధించిన రెం డు సమస్యలను ప్రధానంగా చర్చించింది.


అవి:  కేంద్ర రాబడుల నుంచి రాష్ట్రాల మధ్య పంపకం కావాల్సిన నిధులు ఏవి? ఎంత?
 కేంద్ర రాబడులలో రాష్ట్రాల వాటా పంపకాన్ని నిర్ణయించే వివిధ అంశాలకు ఏ వెయిటేజీని ఇవ్వాలి?
 పై రెండు అశాలను చర్చించడంతో పాటూ కేంద్ర ప్రభుత్వం ద్రవ్య వనరులను గందరగోళపరచి దేశాన్ని కనీవినీ ఎరుగని రుణ సుడిగుండంలోకి, విదేశీ మారకద్రవ్య సంక్షోభంలోకి ఈడుస్తున్న తీరు పట్ల మా తీవ్ర ఆందోళన ను కూడా వ్యక్తం చేయదలచుకున్నాం. 1991లో దేశం తీవ్ర విదేశీమారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు సైతం కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) 2.6 శాతం మాత్రమే. నేడది 4.5 శాతం కంటే ఎక్కువే. మొత్తం విదేశీ రుణంలో ఏడాది గడువు స్వల్పకాలిక రుణ భారం 25 శాతానికి చేరి విదేశీమారక పరిస్థితిని విషమింపజేస్తోంది.


 గత నాలుగేళ్లలో ప్రతి ఏడాది ద్రవ్య లోటు జీడీపీలో 5 శాతానికి పెరిగింది. అందులో 80 శాతం రాబడి లోటును పూడ్చుకోడానికే పోతోంది. ఆశ్చర్యకరంగా రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కార్పొరేటు రంగానికి అందాల్సిన నిధులను అందకుండా చేస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌తో సంబంధంలేని జూదంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2013 జూలై నివేదిక ఇలా పేర్కొంది:


 ‘‘పారిశ్రామిక ఉత్పత్తి సూచిక జూన్ 2012లో -2.0 శాతం ఉండగా అది జూన్ 2013లో -2.2 శాతానికి క్షీణించింది. ఏప్రిల్-జూన్ 2012-13లో -0.2 శాతంగా ఉన్న ఈ సూచిక ఏప్రిల్-జూన్ 2013-14లో -1.1 శాతానికి పడిపోయింది.’’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసిక రెవెన్యూ రాబడులు గత ఏడాది అదే కాలంతో పోలిస్తే -1.3 శాతానికి పైగా పడిపోయాయని కూడా తెలిపింది. గత ఏడాది రాబడులు ముందటి ఏడు కంటే 30.6 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ లెక్కన మన దేశం ఎక్కడికి పోతున్నట్టు?

 దేశం ఎన్నడూ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉండటం ఎరుగం. బొగ్గు, విద్యుత్తులేక దాదాపు 60 శాతం చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఇంచుమించు మూతపడుతున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికం చివరికి వాస్తవ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 48.4 శాతంగానూ, రాబడి లోటు 55.4 శాతంగానూ ఉంది. ద్రవ్య, రాబడి లోట్లు విపరీతంగా పెరిగిపోవటం ద్రవ్యోల్బణాన్ని మరింత విషమం చేస్తుంది. ఈ ఏడాది కేంద్ర రాబడిలో 50 శాతం రుణాలపై వడ్డీలకే సరిపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వం బహిర్గత కారణాలను చూపుతోంది. కానీ మన దిగుమతులు 50,000 కోట్ల డాలర్లుకాగా, ఎగుమతులు 30,000 కోట్ల డాలర్లు. ఈ లోటు ఎక్కువేం కాదు. కేంద్ర సంక్షేమ పథకాలను (సీఎస్‌ఎస్) బాధ్యతారహితంగా ప్రవేశపెడుతూనే ఉన్నారు. మరో వంక కేంద్రం రాష్ట్రాలు అవి ద్రవ్యపరమైన బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని (ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం) ఉల్లంఘించినా శిక్షించాలని భావిస్తోంది. అందుకే 14వ ఫైనాన్స్ కమిషన్ ముందున్న ముఖ్య అంశాల్లో కేంద్ర రాబడులు కూడా ఒకటి.

 I. కేంద్ర రాబడుల నుంచి రాష్ట్రాల మధ్య పంపకం కావాల్సిన ఏవి? అది ఎంత?
 కేంద్ర రాబడులలో కస్టమ్స్, ఎక్సైజు డ్యూటీలూ, సర్వీసు, ప్రత్యక్ష పన్నులు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రాలకు పంపకం అవుతున్నాయి. సెస్‌లు, సర్‌చార్జీలతోపాటూ కేంద్ర పన్నే తర రాబడులను కూడా అందులో చేర్చాలని పలు పార్టీలు, రాష్ట్రాలు 13వ ఫైనాన్స్ కమిషన్‌ను కోరాయి. కమిషన్ అందుకు అంగీకరించలేదు. అలాగే అన్ని రెవెన్యూ అకౌంటు బదలాయింపులపైనా సూచనాత్మక సీలింగ్‌ను 50 శాతంగా నిర్ణయించాలని కూడా కోరారు. 13వ కమిషన్ దాన్ని మొత్తం కేంద్ర రెవెన్యూ రాబడులలో 39.5 శాతంగా సూచించింది. కేంద్ర పన్నులలో పంచుకోదగిన నికర రాబడులను 40 శాతంగా నిర్ణయించాలని కోరగా, ఏడాదికి 32 శాతాన్ని మాత్రమే సూచించింది. అంతకంటే ఎక్కువ స్థాయి బదలాయింపులు జరగాలనడానికి ప్రధాన కారణాలు ఇవి:

 1. 1991కి ముందు కేంద్ర ప్రభుత్వ రంగం ఆర్థిక వ్యవస్థలో, ప్రత్యేకించి ఉపాధి, రాబడుల కల్పనలో, ప్రాంతీయ సమతుల్యతల సాధనలో కీలక పాత్ర నిర్వహించేది. మన రాష్ట్రంలో బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, హెచ్‌సీఎల్, ఈసీఐఎల్, విశాఖ ఉక్కు తదితర భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసింది. వాటి అనుబంధ యూనిట్లతో కలిసి అవి రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పించాయి. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ రాబడులను కూడా పెంపొందింపజేశాయి. సీసీఎంబీ, డీఆర్‌డీఎల్, శ్రీహరి కోట ఉపగ్రహ కేంద్రం మొదలైన పలు ప్రతిష్టాత్మక ఆర్ అండ్ డీ లేబరేటరీలను నెలకొల్పింది. కేంద్రం చొరవ ఫలితంగా రాష్ట్రం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందింది.

 

స్థానిక వ్యాపార, పారిశ్రామిక దక్షత వికసించింది. అయితే ఆ తదుపరి కేంద్రం ప్రభుత్వ రంగ పెట్టుబడుల విస్తరణకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. పారిశ్రామిక లెసైన్సింగ్ విధానాన్ని తొలగించింది. పెట్టుబడులను ఆకర్షించగల ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపైనే పడింది. 1991తో పోలిస్తే రాష్డ్ర ప్రభుత్వా లు అందుకోసం గణనీయంగా అదనపు పెట్టుబడులను పెట్టాల్సివస్తోంది. అంటే కేంద్రం వద్ద 1991 తర్వాత ఎక్కువ మిగులు నిధులు ఉంటున్నాయని అర్థం. అందువలన ఈ కమిషన్ ఉత్తమ మౌలిక సదుపాయల కల్పన, ప్రత్యేక ఆర్థిక మండలాల స్థాపన చేపట్టిన రాష్ట్రాలకూ, శ్రామిక నైపుణ్యం, ఉత్పాదికతల స్థాయిని పెంపొందిపజేసే సంస్థల స్థాపన చేపట్టే రాష్ట్రాలకూ అదనపు బదలాయింపులు జరిగేలా తగు పద్ధతిని ప్రవేశపెట్టవలసి ఉంది.

 2. జనాభారీత్యానూ, విస్తీర్ణం రీత్యానూ కూడా మన రాష్ట్రాల్లో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. పైగా ప్రతి రాష్ట్రం లోనూ వివిధ జిల్లాలకు భిన్న అభివృద్ధి స్థాయిలు, మానవాభివృద్ధి సూచికలు, వనరులు ఉన్నాయి. అందువలన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ వనరులకు, ప్రాధాన్యాలకు అనుగుణంగా సొంత సామాజిక ఆర్థిక వ్యూహాలను రూపొం దించుకునే అవకాశం కల్పించాలి. కాని కేంద్రం ఒకే విధమైన కేంద్ర పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతోంది. గంగానదీ మైదానాలలో వ్యవసాయం వర్షాధారం కాదు. కాగా వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న రాష్ట్రాల్లోని నదులు కూడా వర్షాధారమైవదే. ఈ తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేస్తోంది. అలాగే రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై) పథకం కూడా. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో సగటు వార్షిక వృద్ధి లక్ష్యమైన 4 శాతం రేటును సాధించి, బడ్జెట్‌కు అనుగుణంగా కేటాయింపులను చేస్తున్న రాష్ట్రాలు, చేయని రాష్ట్రాలు అన్న విచక్షణ లేకుండా... జాతీయ ఆహార భద్రత మిషన్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ పథకం కింద వ్యవసాయరంగానికి అంతటా ఒకే విధంగా ప్రోత్సహకాలను అందించడంలోని ఔచిత్యమేమిటో తెలి యదు. వ్యవసాయం స్థానిక పరిస్థితులకు లోబడి ఉండేది.

ఉదాహరణకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 322 సేద్య పరిస్థితులున్నాయి. ప్రతిదానికి ప్రత్యేకమైన వ్యూహం, భిన్నస్థా యిల పెట్టుబడులు అవసరం. కాగా మొత్తం దేశానికి కేంద్ర ప్రభుత్వం ఒకే విధమైన ప్రాతిపదికను ఎలా నిర్దేశించిందనేది ఆశ్చర్యకరం. దేశంలోని పలు రాష్ట్రాలకు స్థానిక అవసరాలపై ఆధారపడిన సొంత పేదరిక నిర్మూలన పథకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో ఒకటి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ఆహార భద్రత, వృద్ధాప్య పెన్షన్లు, ఆరోగ్య భద్రత, గృహవసతి, ప్రభుత్వ వ్యయంతో విద్య వంటి పలు సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలయ్యాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి, వ్యాట్, మునిసిపల్ పన్నులుగానీ, నీరు, విద్యుత్తు, ఆర్‌టీసీ చార్జీలనుగానీ పెంచకుండానే, రెవెన్యూ లోటు లేకుండానే 2004-09 మధ్య అవి అమలయ్యాయి. అందువలన ప్రజల అవసరాలను రాష్ట్రాలే బాగా అర్థం చేసుకోగలుగుతాయి. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి వ్యయాల ప్రాధాన్యతను నిర్ణయించుకోగల సామర్ధ్యం కూడా వాటికి ఉంటుంది.

 ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో అమలవుతున్న కేంద్ర పథకాలకు స్వస్తిపలికి, వాటికి బదులుగా రాష్ట్రాలకు మరింత ఎక్కువ రాబడి బదలాయింపు చేసే విషయాన్ని కేంద్ర పభుత్వం పరిశీలించాలి. సెస్‌లు, సర్‌చార్జీలు, కేంద్ర పన్నేతర రాబడులను రాష్ట్రాలకు బదలాయించే నిధిలో చేర్చి, కనీసం అందులో 40 శాతాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే అంశాన్ని ఈ కమిషన్ పరిశీలించాలని బలంగా కోరుతున్నాం.


 II. కేంద్ర రాబడులలో రాష్ట్రాల వాటా బదలాయింపును నిర్ణయించే వివిధ అంశాలకు ఏ వెయిటేజీని ఇవ్వాలి?
 ఈ అంశంపై పదమూడవ పైనాన్స్ కమిషన్ దిగువ వెయిటేజీలను సూచించింది.  13వ పైనాన్స్ కమిషన్ ద్రవ్య సామర్ధ్యపు అంతరానికి అత్యధికంగా 47.5 శాతం వెయిటేజీని ఇచ్చింది. తలసరి రాబడి అత్యధికంగా ఉన్న మొదటి, రెండు రాష్ట్రాలైన హర్యానా, గోవాలను అది ప్రాతిపదికగా తీసుకుంది. ఇది నిధుల బదలాయింపుకు అత్యుత్తమ పద్ధతి కాదని మా అభిప్రాయం. ఈ పద్ధతిలో జీఎస్‌డీపీలో నిష్పత్తిగా అధిక రాబడులతో మంచి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రా లను శిక్షించడం జరుగుతుంది. పరిపాలనా లోపాల కారణంగా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సహకాలు కొనసాగుతూనే ఉంటాయి. తలసరి ఆదాయాల అంచనాలు రాష్ట్రాల వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించజాలవు. ప్రతి రాష్ట్రంలోనూ తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచిక, తదితర పారమితులలో చాలా అంతరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి పన్నుల రాబడి చాలా ఎక్కువగా ఉంది. అయితే దానికదే వివిధ జిల్లాల ప్రజల మానవాభివృద్ధి సూచికకు హామీని కల్పించజాలదు. ఉదాహరణకు 2012-13లో మహారాష్ట్ర జీఎస్‌డీపీ రూ.13.72 లక్షల కోట్లు. దేశంలోకెల్లా అతి ఎక్ముక తలసరి ఆదాయంగల (రూ.1,05,000) రాష్ర్టం.

కానీ ఆ రాష్టంలోని 35 జిల్లాల్లో 9 జిల్లాల తలసరి ఆదాయం రాష్ట్ర సగటుతోనే కాదు దేశ సగటుతో (2011-12లో రూ.61,656) పోల్చినా త క్కువే. 17 జిల్లాల పరిస్థితి ఒడిశా లేదా బీహార్‌లంత అధ్వాన్నం. అలాగే ఏపీలోని 23 జిల్లాల్లో 9 జిల్లాల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువే. సగటు నికర ఎస్‌డీపీని బట్టి చూస్తే మహారాష్ట్రకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. కానీ ఆ రాష్ట్ర జీడీపీలోని అత్యధిక భాగం కొన్ని పెద్ద పట్టణ ప్రాంతాలలోనే కేంద్రీకృతమై ఉంది. దుర్భరమైన జీవితాలనే గడుపుతున్న అట్టడుగు స్థాయి ప్రజలకు అది చేరడంలేదు. జనాభాలోని అధిక భాగానికి మేలు చేకూరడం లేదు. అలాంటి రాష్ట్రాలకు వాటికి రావాల్సిన వాటాను నిరాకరించడం పెద్ద పొరపాటు. బీహార్ (11 శాతం), ఉత్తరప్రదేశ్‌ల (19.98 శాతం) కంటే మంచి ఫలితాలను సాదిస్తున్న మహారాష్ట్ర (5.28 శాతం), గుజరాత్ (3.8 శాతం), తమిళనాడు (5.04 శాతం), ఆంధ్రప్రదేశ్ (7.04 శాతం) రాష్ట్రాలకు తక్కువ బదాలాయింపులు కొనసాగుతుండటం దురదృష్టకరం. సమానత్వం అంటే ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచడం, ఫలితాలను సాధించలేని రాష్ట్రాలను ప్రోత్సహించడం కారాదు. కానీ దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది.  ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వెయిటేజీని 47.5 శాతం నుంచి 20 శాతానికి తగ్గించి, మిగిలిన 27.5 శాతాన్ని జనాభా, విస్తీర్ణం, సామాజిక రంగ వ్యయం, అధిక ప్రణాళికావ్యయం వంటి పారమితులకు కేటాయించాలని కోరుతున్నాం.

 (1)    రాబడుల బదాలాయింపు (టీవోఆర్) పేరా 7లో కమిషన్ 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంది. చాలా కాలంగా కేంద్రం అదే ప్రాతిపదికపై బదలాయిం పులు చేస్తుంది. ఇప్పుడు కమిషన్ ఆ తర్వాత వచ్చిన జనాభాపరమైన మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని పేర్కొంది. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఆ తదుపరి జనాభాపరమైన మార్పులను పరిగణనలోకి తీసుకుంటే భారీ పెట్టుబడులు పెట్టి, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిన ఏపీ వంటి రాష్ట్రాలకు అది అననుకూలమవుతుంది. దేశ జనాభాలో ఏపీ జనాభా 1971లో 8 శాతం కాగా 2011లో 7 శాతమే. జనాభా నియంత్రణ ముఖ్య కర్తవ్యంగా ఉన్న పరిస్థితుల్లో కమిషన్ ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చితే ఆ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ఇచ్చినట్లు అవుతుంది. ఐరాస మానవాభివృద్ధి నివేదిక పారమితుల దృష్ట్యా భారత జనాభాలో 70-80 శాతం దుర్భర పేదరికంలో నివసిస్తున్నట్టే లెక్క. అందువలన కేంద్ర రాబడుల బదలాయింపులో జనాభాకు 30 శాతం వెయిటేజీని ఇవ్వాలని సూచిస్తున్నాం.

 (2) ప్రతి రాష్ట్రమూ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం నేటి తక్షణ అవసరం. అధిక పెట్టుబడులు పెడితే జీడీఎస్‌పీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రాష్ట్రానికి అధిక రాబడులు ఉండి, ప్రభుత్వ, ప్రభుత్వరంగ వ్యయం పెరగడమని అర్థం. ప్రభుత్వరంగ పెట్టుబడులతో పాటూ ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వ, ప్రభుత్వరంగ వ్యయాలను పెంచి ప్రైవేటు పెట్టుబడులను, జీడీఎస్‌పీని పెంపొందిపజేయడానికి వీలుగా రాష్ట్రాల రుణ సేకరణను అనుమతించాలి. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్రం 2003లో ఎఆర్‌బీఎం చట్టాన్ని చేసింది. 2008-09 నాటికి రెవెన్యూ లోటును సున్నాకు తగ్గించి, ద్రవ్యలోటు జీడీపీలో 3 శాతం ఉండేట్టు చేయాలని నిర్దేశించింది, రాష్ట్రప్రభుత్వపు ద్రవ్య లోటును ఒక  ఏడాది జీఎస్‌డీపీతో ముడిపెట్టడం సరికాదని మనవి చేస్తున్నాం. ద్రవ్యలోటు నిజానికి రాష్ట్ర రాబడితో ముడిపడి ఉన్నది. ైపైగా రుణ సేకరణపై పరిమితి జీఎస్‌డీపీకి ప్రామాణిక స్థాయి నిష్పత్తిలో ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఇది దృష్టిలో ఉంచుకొని రుణాలను తీసుకోవడానికి అర్హత విషయంలో నేటి ఎఫ్‌డీ/ జీఎస్‌డీపీ నిష్పత్తి ఫార్ములాను రద్దుచేసి, రుణాలను రాబ డులకు ముడిపెట్టే విధంగా కమిషన్ కేంద్రానికి మార్పును సూచించాలని కోరుతున్నాం. లేకపోతే కొన్ని రాష్ట్రాలు అనివార్యంగా రుణవలయంలో చిక్కుకుపోతాయి.

 (3) జీఎస్‌డీపీలో రాష్ట్ర రాబడుల నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. పన్నుల పెంపుదలపై కంటే ఆర్థిక పునాదిని విస్తరింపజేయడానికి వైఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడమే అందుకు కారణం. దేశంలో ఏపీ ప్రణాళికా వ్యయమే గత పదేళ్లుగా దాదాపు అధికంగా ఉంటోంది. 2003-04 2008-09 మధ్య రాష్ట్ర ప్రణాళికా వ్యయం రూ.10,366 కోట్ల నుంచి రూ.32,701 కోట్లకు పెరిగింది. ఇలా దేశ వృద్ధికి దోహదం చేసే రాష్ట్రాలకు సహజంగానే ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. స్వతంత్ర భారతంలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. పేదరిక నిర్మూలన పథకాల అమలులో 2003లో 23వ స్థానంలో ఉన్న ఏపీ నేడు ప్రథమ స్థానంలో నిలిచిందని గవర్నర్ ఇటీవలే పేర్కొన్నారు. నీటిపారుదల, బలహీన వర్గాల గృహవసతి వ్యయాలు రాష్ట్ర ప్రణాళికా వ్యయాలకు చోదకశక్తి అయ్యాయి. రాష్ర్టంలోని నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్ర అవసరాలు తీర్చడమే గాక దేశ ఆహార భద్రతకు కూడా తోడ్పడుతున్నాయి. అందువలన నీటిపారుదల వ్యయాలు, ఉచిత విద్యుత్తు వ్యయాలలో కొంత భాగాన్ని కేంద్రం స్వీకరించే యంత్రాంగం ఏర్పాటును కమిషన్ సూచించాలని కోరుతున్నాం. నీటిపారుదల, బలహీనవర్గాల గృహవసతి, సంక్షేమపథకాల అమలు కోసం ప్రణాళికా వ్యయాన్ని పెంపొం దింపజేస్తున్న రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర నిధులలో 25 శాతం వెయిటేజీని ఇవ్వాలని కోరుతున్నాం.

 (1) వ్యవసాయరంగంలోని అల్ప వృద్ధి రేటు, ఉత్పాదకతలో స్తబ్ధత నే డు దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. ఇది వ్యవసాయంపై ఆధారపడ్డ 60 శాతం జనాభా దీర్ఘకాలిక అల్పాదాయ స్థాయిలకు కారణమవుతోంది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల సగటు వార్షిక వృద్ధి రేటు 5.2 శాతం (1981-91) నుంచి సంస్కరణల తదుపరి కాలంలో 2.3 శాతానికి (1991-2012) పడిపోయింది. వ్యవసాయరంగం విఫలమైతే మొత్తగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థే విఫలమవుతుంది. సరిగ్గా అదే జరుగుతోంది. 1991లో 630 జిల్లాల్లో కేవలం 20 జిల్లాలను మాత్రమే నక్సలైటు బాధిత జిల్లాలుగా ప్రకటిస్తే, 2004 నాటికి దాదాపు 200 జిల్లాలను నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. రైతుల దీర్ఘకాలిక ఆదాయాలను పెంచడానికి కృషిని ఏదైనా చేస్తే తప్ప సమ్మిళిత వృద్ధిని కాదుకదా, సమగ్ర వృద్ధిని సైతం సాధించలేం. కేంద్ర ప్రభుత్వం 2007లో ఆహార భద్రతా మిషన్‌ను ప్రారంభించినా ఫలితాలు ప్రోత్సహకరంగా లేవు. వ్యవసాయంలో చెప్పుకోదగిన సాంకేతికపరమైన అభివృద్ధి లేదు.

దీంతో ఉత్పాదకతను పెంచడానికి ఉన్న ఏకైక మార్గం ఎక్కువగా సాగునీటిని అందుబాటులోకి తెచ్చి రైతుల ఆదాయాలను పెంపొందిపజేయడం మాత్రమే. వైఎస్ ప్రభుత్వం సరిగ్గా అదే చేసింది. మా రాష్ట్రం నీటిపారుదల, రైతులకు సబ్సిడీ విద్యుత్తుపై భారీగా పెట్టుబడులను పెట్టింది. ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం దీనివల్ల బాగా లాభపడింది. 2008-09లో తెలంగాణ ప్రాంతం 80 లక్షల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసింది. ఉచిత విద్యుత్తు సదుపాయం లేకపోతే ఇది సాధ్యపడేది కాదు. అలాగే రాష్ట్రం కేంద్ర ఆహార నిల్వలకు పూల్‌కు 90 లక్షల టన్నుల ఆహారధాన్యాలను అందించగలిగేది కాదు. 2004-09 మధ్య రాష్ట్రం వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలలో సగటున 6.87 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసింది. 2004లో 136 లక్షల టన్నులుగా ఉన్న ఆహారధాన్యాల ఉత్పత్తి 2009 నాటికి 204 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తిలో రాష్ట్రం రెండవ అతి పెద్ద ఉత్పత్తిదారుగా మారింది. ఉద్యానవన సేద్యం, పశుపోషణ వంటి అనుబంధ రం గాల పురోగతి కొనసాగింది. నేడు రాష్ట్ర మిగులు ఆహార ధాన్యాలు ప్రధానంగా జాతీయ ఆహార భద్రత కోసమే. అందువలన జాతీయ ఆహార భద్రతకు దోహదపడుతున్న రాష్ట్రాలకు కేంద్ర రాబడుల నుంచి కనీసం 5 శాతాన్ని బదాలాయించి ప్రోత్సహించాలని 14వ ఫైనాన్స్ కమిషన్‌ను కోరుతున్నాం. జాతీయ అహార భద్రతకు దోహదపడే ఆహారధాన్యాల ఉత్పత్తికి ఇచ్చే విద్యుత్తు సబ్సిడీలపై రాష్ట్రాల వ్యయాలను పంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి.

 (2) జనాభాలాగే రాష్ట్ర విస్తీర్ణం కూడా పరిపాలనాపరమైన ముఖ్య పారమితి. దీనికి 13వ ఫైనాన్స్ కమిషన్ 10 శాతం వెయిటేజీని ఇచ్చింది. కానీ ఇందులో కనీసం 2 శాతాన్ని దేశ బౌగోళిక విస్తీర్ణంలో 2 శాతం కంటే తక్కువగా ఉండే రాష్ట్రాలకు కేటాయించాలని నిర్దేశించింది. దీంతో దేశ విస్తీర్ణంలో 0.5 శాతంగా ఉన్న రాష్ట్రాలకు 2 శాతం లభిస్తుండగా దాదాపు 9 శాతం విస్తీర్ణంగా ఉన్న ఏపీకి 6 లేదా 7 శాతం మాత్రమే లభిస్తోంది. ఇది పూర్తిగా అన్యాయం. రాష్ట్ర విస్తీర్ణం పెద్దదైతే పరిపాలనా వ్యయా లు, సేవల చేరవేత వ్యయాలు, శాంతిభద్రతల వ్యయాలు చాలా ఎక్కువ. తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అది మరింత ఖర్చుతో కూడుకున్నది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పారమితి వెయిటేజీని 15 శాతానికి పెంచాలని, 2 శాతం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలకు కనీసం 2 శాతం కేటాయించాలన్న షరతును ఉపసంహరించాలని కూడా కోరుతున్నాం.

 (3) పరిపాలనా సంస్కరణలు, వికేంద్రీకరణ, ఆర్థిక వృద్ధి, క్రమంలో వాతావరణానికి, పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమైనవి. 1991 తర్వాత ప్రభుత్వ పరిపాలనలో గుణాత్మకమైన మార్పు సంభవించింది. ఆర్థికాభివృద్ధిని పెంపొందిపజేయడంలో, మానవాభివృద్ధిని పెంపొందింపజేయడంలో రాష్ట్రాల పాత్ర అసాధారణంగా పెరిగింది. దురదృష్టవశాత్తూ దీనికి దన్నుగా నిలిచే మేధో వనరుల సంస్థలను నెలకొల్పుకోలేదు. ఆలాంటి సంస్థలను నిర్మించిన రాష్ట్రాలకు ఈ ఫైనాన్స్ కమిషన్ అదనపు నిధులను ప్రోత్సహకంగా ఇవ్వాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే కేంద్ర రాబడుల్లో వాటాలు ఇలా ఉండాలి.

 ప్రధాన సూచనలు
- ద్రవ్య సామర్ధ్యపు అంతరం వెయిటేజీని 47.5 శాతం నుంచి 20 శాతానికి తగ్గించాలి. మిగిలిన 27.5 శాతాన్ని జనాభా, విస్తీర్ణం, మొత్తం వ్యయంలో, సామాజిక వ్యయంలో నిష్పత్తిగా ప్రణాళికా వ్యయం వంటి పారమితులకు బదలాయించాలి.
- రాష్ట్ర బడ్జెట్ల నుంచి ఇచ్చే విద్యుత్ సబ్సిడీలతో జాతీయ ఆహార భద్రతకు దోహదపడే రాష్ట్రాలకు ప్రత్యేక వెయిటేజీని ఇవ్వాలి.
- 1971 ప్రాతిపదిక సంపవత్సరంగా జనాభాను లెక్కలోకి తీసుకోవాలి.
- ద్రవ్యలోటు ప్రాతిపదికకు సంబంధించిన గీటురాయిని మార్చాలి. దాన్ని జీఎస్‌డీపీతో ముడిపెట్టరాదు. అందుకు బదులుగా రాష్ట్రాల సొంత రాబడులను రుణాలకు అర్హతగా చేయాలి.
- మెరుగైన రాబడుల పెరుగుదల గల రాష్ట్రాలు ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కోసం మరిన్ని ఎక్కువ నిధులను రుణం తీసుకోవడానికి అనుమతించాలి.
- (వైఎస్సార్‌సీపీ ఈ వినతి పత్రాన్ని శుక్రవారం 14వ ఫైనాన్స్ కమిషన్‌కు అందించింది.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement