అప్పులపై పచ్చ మీడియా దొంగ డప్పు! | Yellow Media Fake News On Andhra Pradesh Govt Debts | Sakshi
Sakshi News home page

అప్పులపై పచ్చ మీడియా దొంగ డప్పు!

Published Tue, Mar 30 2021 3:33 AM | Last Updated on Tue, Mar 30 2021 11:25 AM

Yellow Media Fake News On Andhra Pradesh Govt Debts - Sakshi

కొండంత అప్పులున్న మాట నిజం.. అధికారం చేపట్టే నాటికి చిల్లిగవ్వ లేకపోగా భారీ బకాయిలూ నిజం..వట్టిపోయిన ఖజానా వెక్కిరింపులూ ముమ్మాటికీ నిజం.. అడపాదడపా అప్పులూ, అంతకుమించి ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమ చప్పుడూ నిజమే..! మరి ఇంత అప్పులుండటానికి ఎవరు కారణం?.. అప్పు డప్పు కొట్టిందెవరు?ఊహల్లో విహరిస్తూ ఆర్భాటపు ప్రచారాలతో ఖజానా దివాళాకు బాటలు వేసిందెవరు?
 

సాక్షి, అమరావతి: గత పాలకుల తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుండటం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇక చెప్పుకునేందుకు ఏమీ లేక టీడీపీ నేతలతో పాటు కొన్ని పత్రికలు హఠాత్తుగా రాత్రికి రాత్రే అప్పులు పెరిగిపోయినట్లు కట్టు కథనాలు అల్లుతున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడమే కాకుండా భారీగా బకాయిలు మిగల్చడం, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం తీవ్ర కష్టాల్లో చిక్కుకుందని గుర్తు చేస్తున్నాయి. దీనికితోడు 2020–21లో కోవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వైరస్‌ను నివారించేందుకు అన్ని ప్రభుత్వాలు దీర్ఘకాలం లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చింది. కరోనా కారణంగా ప్రాణనష్టంతో పాటు ఆర్ధికంగానూ నష్టపోవాల్సి వచ్చింది. ఆదాయాలు పడిపోయినప్పటికీ ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. కేంద్రం దేశ చరిత్రలో తొలిసారిగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.18,48,655 కోట్ల మేర అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇవే కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి అదనంగా చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు, మిగిల్చిన బకాయిలు గుదిబండలా మారాయి. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు రెండేళ్లలోనే 90 శాతానికి పైగా హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఇందుకోసం గత సర్కారు తరహాలో నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా అప్పులు చేయలేదు. విచక్షణతోనే వ్యవహరించింది. కోవిడ్‌–19 కారణంగా ఆదాయం పడిపోయినప్పటికీ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి అత్యుత్తమ చికిత్సలు, కష్టకాలంలో పేదలను ఆదుకోవడం, హామీలు అమలు చేసేందుకు విచక్షణతోనే కొంతమేర ఎక్కువగా రుణాలు చేయాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

కేంద్రాన్ని తలదన్నేలా బాబు అప్పులు...
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నాడు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు మించి రెండు రెట్లు ఎక్కువగా అప్పులు చేయడం గమనార్హం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ తరహాలోనే అప్పులు చేసింది కానీ భారీగా రుణాలు తీసుకోలేదు. 2014 మార్చి 31 నుంచి 2019 మార్చి 31 వరకు పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వ అప్పులు 49.92 శాతం పెరగ్గా అదే సమయంలో నాడు చంద్రబాబు సర్కారు అప్పులు 132.31 శాతం మేర ఎగబాకడం గమనిస్తే రాష్ట్రాన్ని ఆయన ఎలా అప్పుల ఊబిలో ముంచారో అర్థమవుతుంది. మరోవైపు గత రెండేళ్లలో (31–03–2019 నుంచి 31–03–2021) కేంద్ర అప్పులు 32.85 శాతం పెరిగితే ఇదే సమయంలో రాష్ట్రం అప్పులు 34.70 శాతమే పెరగడం ఆర్థిక క్రమశిక్షణ, విచక్షణను రుజువు చేస్తోంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గురించి అధికార వర్గాలు, ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. 

పులిమీద పుట్రలా కోవిడ్‌..
కోవిడ్‌కు ముందు కూడా 2019–20లో దేశ ఆర్థిక వృద్ధి ఘోరంగా దెబ్బతింది. దేశ స్థూల ఉత్పత్తి ముందస్తు అంచనాలు 2019–20లో 4.18 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర పన్నుల ఆదాయం గణనీయంగా తగ్గింది. అంతకు ముందు సంవత్సరం కంటే 2019–20లో దేశ స్థూల పన్ను ఆదాయాలు 3.39 శాతం తగ్గాయి. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కష్ట సమయంలోనే పులిమీద పుట్రలా కరోనా మహమ్మారి వచ్చి పడింది. దేశంలో దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రియల్‌ జీడీపీ –23.9 శాతానికి పడిపోయింది.

ఈ సమస్యలు, సవాళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మరెన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. విభజనతో పాటు చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అసంబద్ధమైన విధానాలతో 2014 – 19 మధ్య విపరీతమైన అసమానతలకు గురైంది. గత సర్కారు హయాంలో చేసిన రుణాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ సర్కారు 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ఏప్రిల్‌లో కేవలం పది రోజుల్లోనే రూ.6,000 కోట్లను పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసి గట్టి గుణపాఠం చెప్పారు. 

నాడు అందినకాడికి అప్పులు..
2014–19 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాలను మించి చంద్రబాబు సర్కారు రెండింతలు ఎక్కువగా రుణాలను తీసుకుంది. నాడు కేంద్ర ప్రభుత్వం అప్పులు 49.92% పెరిగితే చంద్రబాబు సర్కారు 132.31 శాతం మేర అప్పులు ఎక్కువగా చేసినట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఆయన అస్తవ్యస్థ విధానాలు, ఆర్భాటపు ఖర్చులు, అసంబద్ధ నిర్ణయాలు రాష్ట్రంపై మరింత ఆర్థిక భారాన్ని మోపాయి.

ఇక గత సర్కారు 2019 మార్చి 31వతేదీ నాటికి రూ.39,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. అంతేకాకుండా బడ్జెట్‌ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో రూ.58,000 కోట్ల మేర అప్పులు చేసింది. విద్యుత్‌ రంగ సంస్థల అప్పులు 2014–19 మధ్య కాలంలో రూ.33,587 కోట్ల నుంచి రూ.70,254 కోట్లకు పెరిగాయి. దీనికి అదనంగా విద్యుదుత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు (డిస్కంలు) చెల్లించాల్సిన బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగిపోయాయి. 2014–19 మధ్య కాలంలో రుణాలపై వడ్డీ చెల్లింపుల భారం రూ.25 వేల కోట్లకుపైగా పెరిగింది.

అనుత్పాదక వ్యయాలు..
అప్పులను ఉత్పాదక రంగాలపై వ్యయం చేసి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడేది. అందుకు విరుద్ధంగా అనుత్పాదక రంగాలపై అస్తవ్యస్తంగా వ్యయం చేశారు. మరోపక్క వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య రంగాలను చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. 2014 మార్చి 31 నాటికి 184వ ఎస్‌ఎల్‌బీసీ మినిట్స్‌ ప్రకారం వ్యవసాయ అప్పులు రూ.87,612 కోట్లున్నాయి.

అయితే చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీని పలు షరతులతో రూ.24,000 కోట్లకు కుదించింది. కనీసం ఆ మొత్తాన్ని కూడా మాఫీ చేయకుండా దాదాపు రూ.8,500 కోట్లను రైతులకు బకాయిపెట్టింది. 2016–17లో వ్యవసాయ కుటుంబాల అప్పులు దేశంలో సగటున 47 శాతం ఉండగా మన రాష్ట్రంలో అత్యధికంగా 77 శాతంగా ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ సర్కారు రుణ మాఫీ పేరుతో రైతులను వంచించడమే.

అస్తవ్యస్థ విధానాలతో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుంది. 2014 ఎన్నికల ముందు టీడీపీ పలు మోసపూరిత హామీలిచ్చింది. స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చకుండా వంచించింది. ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దేశంలో అతి తక్కువగా 83.2 శాతం మాత్రమే ఉంది. 

పథకాల అమలులో పారదర్శకత.. నేరుగా నగదు బదిలీ
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ విప్లవాత్మక చర్యలు చేపట్టింది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం కల్పించింది. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు, ఆధునీకరణతో పాటు ఇంగ్లీష్‌ మీడియం కోసం చర్యలు తీసుకుంది. వైద్య కళాశాలలను మెరుగుపరచడంతో పాటు కొత్త మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల తల్లులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందచేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు మహిళా సాధికారత దిశగా కృషి చేస్తోంది.

కోవిడ్‌ నియంత్రణ, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక ఒడిదొడుకుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా అమలు చేసింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఆసరాగా నిలిచింది. వివిధ పథకాలు అమలులో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చింది.

ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా నగదు బదిలీ విధానాన్ని అమలు చేసి లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసింది. సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా వ్యవహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం భారీగా రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ గత సర్కారు మాదిరిగా విచ్చలవిడిగా కాకుండా విచణక్షతో అప్పులు తీసుకుందని, గత రెండేళ్లలో కేంద్రం అప్పుల పెరుగుదలతో పోలిస్తే రాష్ట్రం అప్పులు పెద్దగా పెరిగినట్లు కాదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

రూ.21,500 కోట్ల ఆదాయం కోల్పోయినా..
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలోనే ఇచ్చిన హామీల్లో 90 శాతం కంటే ఎక్కువగా అమలు చేసింది. కోవిడ్‌ కారణంగా రాష్ట్రం దాదాపుగా రూ.21,500 కోట్లు ఆర్థికంగా నష్టపోయినట్లు అంచనా. కేంద్ర పన్నుల వాటా రూపంలో రావాల్సిన రూ.7,780 కోట్లు కోల్పోయింది. రాష్ట్ర సొంత పన్నుల్లో రూ.6,961 కోట్లు నష్టపోయింది. మొత్తం మీద రూ.14,741 కోట్లు ఆదాయం నష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు కోవిడ్‌–19 నియంత్రణకు రూ.6700 కోట్లు అదనంగా వ్యయం చేయాల్సి వచ్చింది. ఇక కోవిడ్‌ కారణంగా రాష్ట్రం కోల్పోయిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటే వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement