నవ్య స్ఫూర్తి
నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు
అనంతపురం కల్చరల్ : బాల సాహిత్యం.. వ్యక్తిత్వ వికాసం.. ఆధ్యాత్మికం..సినీ, క్రీడా ఇలా అన్ని రకాల సాహితీ విందునందించిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. రాష్ట్ర సాంస్కతిక శాఖ, ఎన్టీఆర్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుంచి అనంతపురంలో సాగిన. పుస్తక ప్రదర్శనతో జిల్లా వాసులకు ప్రఖ్యాతి చెందిన రచయితలు, రాజకీయ విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పేరు గాంచిన పబ్లిషింగ్ అధినేతలతో దగ్గరగా పరిచయం ఏర్పడింది. వివిధ పుస్తకాల ఆవిష్కరణల ద్వారా అనంత కరువు, సీమ కడగండ్లపై సాగిన రచనలలోని గొప్పతనాన్ని తెలుసుకునే వీలును కూడా బుక్ ఫెస్టివల్ కల్పించింది. యువతకు స్ఫూర్తి రగిలించే క్విజ్‌లు, సెమినార్లు, వ్యాసరచనలు, వక్తత్వం, చిత్రలేఖనం, స్పెల్‌బీ, పాటల, పద్యపఠన పోటీలు ఎన్నో జరిగాయి. ప్రాచీన కళల ప్రదర్శనకు పెద్ద పీట వేశారు. గడువు ఇక ఒక్కరోజే ఉంటుందని నగరవాసులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు అంటున్నారు.
పుస్తక ప్రదర్శనను వినియోగించుకోండి
వివిధ ప్రదేశాలలో రాష్ట్రస్థాయి పుస్తక సంబరాలు నిర్వహించాలన్న రాష్ట్ర సాంస్కతిక శాఖ ఆలోచన మేరకు తొలిసారి అనంతలో జరగడం ఆనందంగా ఉంది. నవ్యాంధ్ర, తెలంగాణాల రాష్ట్రాల నుండి వివిధ పుస్తక ప్రచురణ సంస్థలు తరలి వచ్చాయంటే నిజంగా వారిని అభినందించాలి. అందరి అభిరుచికి తగ్గట్టు పుస్తకాలను జిల్లా వాసుల ముగింట చేర్చాము. మిగిలిన ఒక రోజు గడువును కూడా సాహితీ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలన్నదే మా విన్నపం.
– అనంత్, పుస్తక ప్రదర్శన సమన్వయకర్త