శ్రావణం.. శుభప్రదం | today start sravana masam | Sakshi
Sakshi News home page

శ్రావణం.. శుభప్రదం

Published Sun, Jul 23 2017 8:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

today start sravana masam

సందర్భం : నేటి నుంచి నోముల మాసం ప్రారంభం
సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర శ్రావణ మాసం రానేవచ్చింది.  అన్ని మాసాలలోనూ ఎంతో శుభప్రదమైనదని పురాణాలు చెపుతున్న ఈ మాసంలో శుభకార్యాలు, నోములు, వ్రతాలు..అన్నీ అధికంగా పలకరిస్తాయి.  ఈ మాసం వచ్చిదంటే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొని ఉంటుంది. పెళ్లి పనులతో కొందరు..  కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతో మరికొందరు తలమునకలుగా ఉంటారు.  కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములతో,  వ్రతాలతో ఈ నెలంగా ఇట్టే గడచిపోతుంది. అమావాస్యతో ఆషాడానికి వీడ్కోలు పలుకుతూ పండుగల మాసం సోమవారంæ నుంచి ప్రారంభం కానుంది.
- అనంతపురం

సందడిగా సాగే  ప్రధాన పండుగలన్నీ శ్రావణంలోనే కనపడతాయి. ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతం, 7న రాఖీ పౌర్ణిమ... సనాతన ధర్మాన్ని చాటుతుంటాయి.  అందరూ సమానమన్నట్టు బలరామకృష్ణు్ణల జయంతి, హయగ్రీవ జయంతి వంటివి భక్తిభావాలను మరింత పెంచుతాయి. 15న రానున్న శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదినం శ్రావణ మాసానికే తలమానికంగా నిలుస్తుంది. శ్రావణ బహుళ విధియనాడు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. అలాగే మంగళగౌరి వ్రతం, నాగపంచమి, సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసంలో రావడం విశేషం.

మహా శివునికీ ప్రీతికరమే..
అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో చేసే శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు పరమపద మోక్ష ప్రాప్తి కల్గిస్తాయని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మహిళలు సుమంగళిగా జీవించాలని ఐదవతనం కోసం చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలు పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి.

శ్రావణ పూజలు అత్యంత శుభప్రదం
శ్రావణం సమస్త హైందవ జాతిని ఏకం చేసే మహత్తర సాధనంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సర్వపాపల హరణకు, సకల శుభ యోగాలకు శ్రావణ మాస పూజలు శ్రేష్టమైనవి. పవిత్ర శ్రావణంలో వచ్చే ప్రతి దినమూ మంగళకరమే.
– సాయినాథ దత్త, పురోహితులు, అనంతపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement