today start
-
నేటి నుంచి అండర్–16 సెమీస్ మ్యాచులు
అనంతపురం సప్తగిరిసర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 సెమీఫైనల్ మ్యాచులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వెంకటగిరిలో అనంతపురం, తూర్పుగోదావరి జట్ల మధ్య సెమీస్ మ్యాచ్‌లో తలపడనుంది. కడపలోని ఏసీఏ గ్రౌండ్లో కడప, వైజాగ్ జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు సెమీస్ మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్–ఏ విభాగంలో వైజాగ్, తూర్పుగోదావరి జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా, గ్రూప్–బీలో అనంతపురం, కడప జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆయా జట్లను సెమీస్‌లో తలపడనున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు వెంకటగిరిలో జరిగే ఫైనల్ పోటీల్లో తలపడనున్నాయి. -
జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు
– నేటి నుంచి మూడు రోజుల క్రీడాపండుగ – డీఎస్ఏ, ఆర్డీటీ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు – 29న ర్యాలీ, సాయంత్రం ముగింపు కార్యక్రమాలు అనంతపురం సప్తగిరిసర్కిల్: జిల్లాలోని క్రీడాకారులకు శుభవార్త. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్), ఆర్డీటీ సంస్థలు ప్రత్యేక క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నాయి. డీఎస్ఏ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జిల్లాస్థాయిలో బాక్సింగ్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ పోటీలు ఉండగా.. ఆర్డీటీ ఆధ్వర్యంలో అనంత క్రీడా గ్రామంలోని అకాడమీలకు చెందిన 170 మంది క్రీడాకారులను భాగస్వాములను చేసి క్రికెట్, యోగా, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. 170 మంది క్రీడాకారులను 11 మంది సభ్యులతో కూడిన 17 జట్లుగా విడగొట్టి వారిని అన్ని క్రీడల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారుల పేర్లను ఆయా జట్లకు కేటాయించి వారికి మూడు రోజులు పోటీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రతిరోజు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరచిన ఉత్తమ క్రీడాకారులను రోజుకు ముగ్గురు చొప్పున సత్కరించనున్నారు. సత్కారం అందుకుంటున్న వారి వివరాలు 27–08–2017 : డాక్టర్ అక్బర్ సాహెబ్ – టేబుల్ టెన్నిస్, ప్రకాష్–ఫుట్‌బాల్, ముద్దుకృష్ణ–అథ్లెటిక్స్ 28–08–2017 : అబ్దుల్ రజాక్–టెన్నిస్, చంద్రమౌళి–షట్టిల్, మునీర్‌బాషా–హాకీ 29–08–2017 : నరేష్–వాలీబాల్, విశ్వనాథచౌదరి–కబడ్డీ, శ్రీకాంత్‌రెడ్డి–బాస్కెట్‌బాల్ ర్యాలీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 29న ఉదయం టవర్‌క్లాక్ నుంచి డీఎస్ఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. -
నేటి నుంచి ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తన పంపిణీ శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి యాప్ కూడా సిద్ధమైనట్లు వెల్లడించారు. బయోమెట్రిక్ పద్ధతిలో కంది, ఉలవ, అలసంద, పెసర, మేత జొన్న, కొర్ర, గోరుచిక్కుడు విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక హైబ్రిడి రకానికి చెందిన జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలకు కిలోకు రూ.50 రాయితీ వర్తింపజేశారు. అలాగే బహుధాన్యపు కిట్లు పంపిణీ చేయనున్నారు. ఉచితంగా ఇచ్చే విత్తనాలకు సంబంధించి యాప్ సిద్ధం కావడంతో శనివారం నుంచి 35 మండలాల్లో పంపిణీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 1.15 లక్షల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు కేటాయించగా, అందులో అత్యధికంగా 50 వేల క్వింటాళ్లు ఉలవలు సరఫరా చేశారు. ప్రస్తుతానికి 35 మండలాలకు కొంతవరకు విత్తనాలు సరఫరా అయినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో జొన్నలు 590 క్వింటాళ్లు, సజ్జలు 150 క్వింటాళ్లు, కొర్ర 77 క్వింటాళ్లు, పెసలు 1,055 క్వింటాళ్లు, ఉలవలు 1,010 క్వింటాళ్లు, అలసందలు 155 క్వింటాళ్లు, కందులు 6 క్వింటాళ్లు, మొక్కజొన్న 722 క్వింటాళ్లు జిల్లాకు చేరినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో అన్ని రకాల విత్తనాలు 21వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం. విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా మండలాల్లోని ఏఓ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. -
శ్రావణం.. శుభప్రదం
సందర్భం : నేటి నుంచి నోముల మాసం ప్రారంభం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర శ్రావణ మాసం రానేవచ్చింది. అన్ని మాసాలలోనూ ఎంతో శుభప్రదమైనదని పురాణాలు చెపుతున్న ఈ మాసంలో శుభకార్యాలు, నోములు, వ్రతాలు..అన్నీ అధికంగా పలకరిస్తాయి. ఈ మాసం వచ్చిదంటే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొని ఉంటుంది. పెళ్లి పనులతో కొందరు.. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతో మరికొందరు తలమునకలుగా ఉంటారు. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములతో, వ్రతాలతో ఈ నెలంగా ఇట్టే గడచిపోతుంది. అమావాస్యతో ఆషాడానికి వీడ్కోలు పలుకుతూ పండుగల మాసం సోమవారంæ నుంచి ప్రారంభం కానుంది. - అనంతపురం సందడిగా సాగే ప్రధాన పండుగలన్నీ శ్రావణంలోనే కనపడతాయి. ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతం, 7న రాఖీ పౌర్ణిమ... సనాతన ధర్మాన్ని చాటుతుంటాయి. అందరూ సమానమన్నట్టు బలరామకృష్ణు్ణల జయంతి, హయగ్రీవ జయంతి వంటివి భక్తిభావాలను మరింత పెంచుతాయి. 15న రానున్న శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదినం శ్రావణ మాసానికే తలమానికంగా నిలుస్తుంది. శ్రావణ బహుళ విధియనాడు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. అలాగే మంగళగౌరి వ్రతం, నాగపంచమి, సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసంలో రావడం విశేషం. మహా శివునికీ ప్రీతికరమే.. అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో చేసే శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు పరమపద మోక్ష ప్రాప్తి కల్గిస్తాయని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మహిళలు సుమంగళిగా జీవించాలని ఐదవతనం కోసం చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలు పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి. శ్రావణ పూజలు అత్యంత శుభప్రదం శ్రావణం సమస్త హైందవ జాతిని ఏకం చేసే మహత్తర సాధనంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సర్వపాపల హరణకు, సకల శుభ యోగాలకు శ్రావణ మాస పూజలు శ్రేష్టమైనవి. పవిత్ర శ్రావణంలో వచ్చే ప్రతి దినమూ మంగళకరమే. – సాయినాథ దత్త, పురోహితులు, అనంతపురం -
నేటి నుంచి అండర్–16 మహిళ క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలను ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 13 వరకు సాగుతాయన్నారు. ఈ పోటీల్లో సౌత్‌జోన్‌కు చెందిన అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జట్లు పోటీల్లో తలపడతాయన్నారు. అండర్–19 మహిళ క్రికెట్ పోటీలు ఈ నెల 15 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలోని బీ–గ్రౌండ్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అండర్–16 పోటీలు 25 ఓవర్ల ఫార్మాట్లోను, అండర్–19 పోటీలు 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతాయన్నారు. అండర్–16 మ్యాచ్‌ల వివరాలు తేదీ తలపడే జట్లు 9-07-17 కడప–కర్నూలు ఉదయం 9–07–17 అనంతపురం–నెల్లూరు మధ్యాహ్నం 10–07–17 చిత్తూరు–నెల్లూరు ఉదయం 10–07–17 అనంతపురం–కర్నూలు మధ్యాహ్నం 11–07–17 అనంతపురం–కడప ఉదయం 11–07–17 చిత్తూరు–కర్నూలు మధ్యాహ్నం 12–07–17 నెల్లూరు–కర్నూలు ఉదయం 12–07–17 కడప–చిత్తూరు మధ్యాహ్నం 13–07–17 చిత్తూరు–అనంతపురం ఉదయం 13–07–17 కడప–నెల్లూరు మధ్యాహ్నం అండర్–19 మ్యాచ్‌ల వివరాలు తేదీ తలపడే జట్లు 15–07–17 కడప–కర్నూలు 15–07–17 అనంతపురం–నెల్లూరు 16–07–17 చిత్తూరు–నెల్లూరు 16–07–17 అనంతపురం–కర్నూలు 18–07–17 అనంతపురం–కడప 18–07–17 చిత్తూరు–కర్నూలు 19–07–17 నెల్లూరు–కర్నూలు 19–07–17 కడప–చిత్తూరు 20–07–17 చిత్తూరు–అనంతపురం 20–07–17 కడప–నెల్లూరు -
ఆల్ ద బెస్ట్
- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు - తొలిరోజు అరగంట ముందే చేరుకోవాలి అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే..తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తుండటంతో విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కన్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49,555 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 193 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈసారి ఒక్క విద్యార్థీ నేలపై కూర్చుని పరీక్ష రాయకూడదనే ఉద్దేశంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి కేంద్రంలోనూ బెంచీలు ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కాస్త గందరగోళం నెలకొన్నా.. పరీక్షల ప్రారంభం సమయానికి అన్నీ సర్దుకుంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మునిసిపల్ టీచర్లు డ్యూటీ రద్దు చేసుకునే యోచనలో ఉండటం సమస్యగా మారింది. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా పరిగణించారు. ప్రతి ఒక్కరూ విధిగా వెళ్లాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షా కేంద్రంలో ఏ చిన్న పొరబాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చిట్టీలు దొరికినా, చూచిరాతలు ప్రోత్సహించినా, ఇతరత్రా ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడినా బా«ధ్యులపై యాక్ట్ 25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థీ ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. వెక్కిరిస్తున్న వెలుతురు, ఉక్కపోత సమస్యలు ఫర్నీచర్ ఏర్పాటు విషయంలో అధికారులు చర్యలు తీసుకున్నా...చాలా కేంద్రాల్లో కరెంట్ సదుపాయం కల్పించలేకపోయారు. ఫలితంగా విద్యార్థులకు చీకటి, ఉక్కపోత కష్టాలు తప్పేలా లేవు. జిల్లా కేంద్రంలోని సెంటర్లలోనే ఇలాంటి సమస్య ఉందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కేంద్రాలు రేకుల షెడ్లలో ఏర్పాటు చేశారు. వాటిలో పరీక్షలు రాసే విద్యార్థులకు కష్టాలు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం
– రెగ్యులర్ డిగ్రీ పరీక్షల్లో తొలిసారిగా ఆన్లైన్లో ప్రశ్నాపత్రం – 27వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫైనలియర్ (రెగ్యులర్), మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి (సప్లిమెంటరీ ) పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్లైన్లో ప్రశ్నాపత్రం పంపించే విధానం దూరవిద్య పరీక్షల్లో సఫలమైంది. దీంతో రెగ్యులర్ డిగ్రీ పరీక్షల్లోను ఇదేవిధానాన్ని అమలు చేస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు నిర్దేశించిన సమయం కంటే గంట ముందు పాస్‌వర్డ్‌ను మెయిల్ ద్వారా, ప్రిన్సిపాళ్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపుతారు. వీటి ద్వారా ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 27 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఫైనలియర్లో 15 వేల మంది హాజరుకానున్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆచార్య రెడ్డి వెంకటరాజు పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రశ్నాపత్రాలు పంపే నూతన విధానంపై డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. -
నేటి నుంచి ర్యాటిఫికేషన్ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వర్సిటీ గుర్తింపునిచ్చేందుకు నిర్వహిస్తున్న ర్యాటిఫికేషన్ ఇంటర్వ్యూలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్ ఆచార్య చెన్నారెడ్డి తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని 7 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి అధ్యాపకులు హాజరవుతారన్నారు. సీఎస్ఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఎంబీఏ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. -
నేటి నుంచి రహదారి భద్రత వారోత్సవాలు
అనంతపురం రూరల్ : రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ కోనా శశిధర్, ఉప రవాణా కమిషనర్ సుందర్వద్దితో కలిసి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నుంచి వారోత్సవాలు ప్రారంభమై ఈ నెల 25వరకు కొనసాగుతాయన్నారు. 19న హైల్మ్ట్లపై, 20న సీట్‌బెల్ట్, 21న డ్రంకన్ డ్రైవ్, 22న అతివేగంపై, 23న ట్రిపుల్ రైడింగ్, 24న వెహికల్ బీమా, 25న వెహికల్ డీలర్లు, డ్రైవర్లు, యూనియన్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషన్ సుందర్‌వద్ది తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి శ్రీధర్‌తోపాటు ఆర్టీఓ, వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.