ఆల్ ద బెస్ట్
- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
- తొలిరోజు అరగంట ముందే చేరుకోవాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే..తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తుండటంతో విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కన్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49,555 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 193 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈసారి ఒక్క విద్యార్థీ నేలపై కూర్చుని పరీక్ష రాయకూడదనే ఉద్దేశంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి కేంద్రంలోనూ బెంచీలు ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కాస్త గందరగోళం నెలకొన్నా.. పరీక్షల ప్రారంభం సమయానికి అన్నీ సర్దుకుంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా మునిసిపల్ టీచర్లు డ్యూటీ రద్దు చేసుకునే యోచనలో ఉండటం సమస్యగా మారింది. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా పరిగణించారు. ప్రతి ఒక్కరూ విధిగా వెళ్లాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షా కేంద్రంలో ఏ చిన్న పొరబాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చిట్టీలు దొరికినా, చూచిరాతలు ప్రోత్సహించినా, ఇతరత్రా ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడినా బా«ధ్యులపై యాక్ట్ 25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థీ ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు.
వెక్కిరిస్తున్న వెలుతురు, ఉక్కపోత సమస్యలు
ఫర్నీచర్ ఏర్పాటు విషయంలో అధికారులు చర్యలు తీసుకున్నా...చాలా కేంద్రాల్లో కరెంట్ సదుపాయం కల్పించలేకపోయారు. ఫలితంగా విద్యార్థులకు చీకటి, ఉక్కపోత కష్టాలు తప్పేలా లేవు. జిల్లా కేంద్రంలోని సెంటర్లలోనే ఇలాంటి సమస్య ఉందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కేంద్రాలు రేకుల షెడ్లలో ఏర్పాటు చేశారు. వాటిలో పరీక్షలు రాసే విద్యార్థులకు కష్టాలు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.