అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తన పంపిణీ శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి యాప్ కూడా సిద్ధమైనట్లు వెల్లడించారు. బయోమెట్రిక్ పద్ధతిలో కంది, ఉలవ, అలసంద, పెసర, మేత జొన్న, కొర్ర, గోరుచిక్కుడు విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక హైబ్రిడి రకానికి చెందిన జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలకు కిలోకు రూ.50 రాయితీ వర్తింపజేశారు. అలాగే బహుధాన్యపు కిట్లు పంపిణీ చేయనున్నారు. ఉచితంగా ఇచ్చే విత్తనాలకు సంబంధించి యాప్ సిద్ధం కావడంతో శనివారం నుంచి 35 మండలాల్లో పంపిణీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాకు 1.15 లక్షల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు కేటాయించగా, అందులో అత్యధికంగా 50 వేల క్వింటాళ్లు ఉలవలు సరఫరా చేశారు. ప్రస్తుతానికి 35 మండలాలకు కొంతవరకు విత్తనాలు సరఫరా అయినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో జొన్నలు 590 క్వింటాళ్లు, సజ్జలు 150 క్వింటాళ్లు, కొర్ర 77 క్వింటాళ్లు, పెసలు 1,055 క్వింటాళ్లు, ఉలవలు 1,010 క్వింటాళ్లు, అలసందలు 155 క్వింటాళ్లు, కందులు 6 క్వింటాళ్లు, మొక్కజొన్న 722 క్వింటాళ్లు జిల్లాకు చేరినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో అన్ని రకాల విత్తనాలు 21వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం. విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా మండలాల్లోని ఏఓ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది.
నేటి నుంచి ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ
Published Fri, Aug 18 2017 10:15 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement