బాలికలకు భద్రతేది..!? | Today the National Girls' Day | Sakshi
Sakshi News home page

బాలికలకు భద్రతేది..!?

Published Tue, Jan 24 2017 9:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

బాలికలకు భద్రతేది..!?

బాలికలకు భద్రతేది..!?

కడుపులోనే చిదిమేస్తున్న వైనం
గిరిజన బాలికల అక్రమ రవాణా
కొనసాగుతున్న వివక్ష
నేడు జాతీయ బాలికల   దినోత్సవం


బాలికలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల ఆర్థికంగా భారమనే భావనతో సమాజం చిన్నచూపు చూస్తోంది. పిండ దశ నుంచి బాలిక దశలోనూ భద్రత కరువవుతోంది. ఇదే సమయంలో ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనేది నిరూపితమవుతోంది. బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న తెలుగు తేజం సింధు, పైలెట్‌గా రాణిస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన స్వాతి ఇలా చాలామంది తల్లిదండ్రులు, బంధువుల ప్రోత్సాహంతో ఆయా రంగాల్లో దూసుకెళ్తున్నారు. సమాజంలో బాలికలు ఎదిగితే ఆర్థికంగా నష్టపోతామనే అవగాహన లేని తల్లిదండ్రులు, ఎక్కువ చదివితే ఎక్కువ వరకట్నం ఇవ్వాలని అనాలోచిత నిర్ణయాలతో వంటింటికే పరిమితం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకలిచావులు, ఆర్థిక ఒడిదుడుకులకు తాళలేక బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఆధునిక సమజంలోనూ బాలికలపై ఆకృత్యాలు, అత్యాచారాలతో మనుగడ లేకుండా చేస్తున్నారు.

23 మంది బాలికలపై అత్యాచారం..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 23 మంది బాలికలపై అత్యాచారం జరిగిన సంఘటనలు వెలుగు చూడగా.. కేసులు నమోదయ్యాయి. పోలీసులకు నమోదు చేసిన  కేసులు ఉమ్మడి జిల్లాలో 23 ఉండగా.. వెలుగులోకి రాకుండా మభ్యపెట్టి గూడేలు, పల్లెల్లో పంచాయితీతో మరుగునపడినవి ఎన్నో ఉన్నాయి. అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు నవ సమాజంలో సాగుతూనే ఉన్నాయి. చట్టాలు ఉన్నా అవి సరైన రీతిలో అమలు కావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. పోలీసుస్టేషన్ల గడపతొక్కని కేసులు ప్రజాప్రతినిధులు పలుకుబడి ఉన్న వ్యక్తుల కనుసైగల్లో ఎన్నో కేసులు పక్కతోవ పట్టాయనే విమర్శలు ఉన్నాయి.

బాలికల అక్రమ రవాణా..
ఉమ్మడి జిల్లాలో గిరిజన గోండు గూడేల్లో బాలికల అక్రమ రవాణా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బెల్లంపల్లి, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్, వాంకిడి, సిర్పూర్, భీంపూర్, తాండూర్‌ వంటి ఏరియాల్లో బాలికల అక్రమ రవాణా ఎక్కువ సాగుతున్నట్లు సమాచారం. గతకొంత కాలంలో నాలుగైదు అక్రమ రవాణా కేసులను పట్టుకున్నప్పటికీ చిక్కని కేసులు చాలా ఉన్నాయి. రాజస్థాన్‌ ఏరియాల్లో బాలికల శాతం తక్కువగా ఉన్నందున ఇక్కడి ప్రాంతాల్లో అమాయకులకు డబ్బులు వల వేసి అక్రమంగా బాలికలను పెళ్లిళ్లు చేసుకుంటూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ పదుల సంఖ్యలో ఈ తంతు అంతర్గతంగా సాగుతున్నా అధికారులు, పోలీసులు దృష్టి సారించడంలో విఫలం అవుతున్నట్లుగా తెలుస్తోంది.  

బాల్య వివాహాలతో బందీఖానా..
బాలికలకు అభం శుభం తెలియని చిన్న వయస్సుల్లో బాల్య వివాహాలు చేస్తూ బందీఖానాకు పంపుతున్నారు తల్లిదండ్రులు, ఆడపిల్ల అనగానే ఒక బరువుగా భావించి పెళ్లి చేయడమే బాధ్యతగా చూస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే సమయంలో విద్యాభ్యాసానికి దూరం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 120కి పైగా వివాహాలను బాలల సంరక్షణ సమితి అడ్డుకుంది. బయటకు రాకుండా అంతర్గతంగా ఎందరో బాలికలకు వివాహాలు చేసి వారి జీవితాలను తల్లిదండ్రులు అయోమయంలో పడేశారు. అభంశుభం తెలియని బాలికలు చిన్న వయస్సులో వివాహాలు చేయడంతో అనారోగ్యం బారినపడి మృతిచెందిన వారూ లేకపోలేదు.

అసౌకర్యాలు.. వరకట్నాలతో విద్యకు దూరం..
ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అసౌకర్యాల కారణంగానే బాలికలు విద్యకు దూరమవుతున్నట్లుగా తెలిసింది. బాలికలు మల, మూత్ర విసర్జన, పరిసరాలు అనుకూలంగా లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యకు దూరం చేస్తున్నారు. ఎక్కువ విద్యాభ్యాసం చేస్తే దానికనుగుణంగా వరకట్నం ఇవ్వాల్సి ఉటుందన్న అనాలోచిత భావంతో బాలికలను విద్యకు దూరం చేస్తున్నారు. ఆధునిక సమాజంలోనూ బాలికల వివక్ష విద్యాభ్యాసానికి దూరం చేయడం తల్లిదండ్రుల అవగాహన లేమి నిర్ణయాలే కారణమని పలువురు భావిస్తున్నారు.

భ్రూణహత్యలు..
ఆధునిక ప్రపంచంలోనూ ఆడపిల్ల అంటేనే సమాజంలో అలుసుగా భావించే వారు లేకపోలేదు. ఇందులో అనాగరికులు కాకుండా నాగరికత తెలిసి విద్యావంతులుగా, ఉద్యోగులుగా ఉన్నవారే ఎక్కువగా భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బాలికలను కడుపులోనే చిదిమేస్తూ బాహ్యలోకానికి రాకుండా చేస్తున్నారు. నవ సమాజంలో ఆడపిల్ల అనగానే వివక్ష చూపే సమాజం జన్మనిచ్చిన తల్లి కూడా మహిళ అన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. ఈ భ్రూణహత్యల నివారణకు ఆర్థిక లాభాపేక్షే ప్రధానంగా వైద్యులు ఇటువంటి దారుణానికి ఒడిగడుతున్నారు. కడుపులో శిశువు ఎదుగుదల, ఆరోగ్యవంతులుగా ఉన్నారా లేదా అనే స్కానింగ్‌లోనూ భ్రూణహత్యలు సాగుతున్నాయి. ఈ విషయం అంతర్గతంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

కఠిన చట్టాలు అమలులో..
కఠిన చట్టాలు అమలు చేస్తే బాలికల సంరక్షణ, భద్రత సాధ్యపడుతుంది. బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తికి చైల్డ్‌ యాక్టు ప్రకారం శిక్ష ఉంటుంది. దీని కి నాన్‌ బెయిల్‌ఎబుల్‌ వారెంట్‌ను అందజేస్తూ కటకటాల లోపలికి పంపవచ్చు. జూవియల్‌ జస్టిస్‌ యాక్టు ప్రకారంగా శిక్షను విధించవచ్చు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఫోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షను విధించవచ్చు. సంరక్షించే వ్యక్తులే బాలికలపై వేధింపులకు పాల్పడినా, అత్యాచారం చేసినా రెట్టింపు శిక్షలు అమలవుతాయి. భ్రూణహత్యలు చేసిన వారికి పీసీపీఎన్‌డీటీ ప్రకారంగా శిక్షార్హులు. ఈ భ్రూణహత్యలో పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదికలను అందించాలి. అటువంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాలికలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా, వేధింపులకు గురైనా 1098, 100 నెంబర్లకు సమాచారం అందిస్తే సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపడతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement