‘స్వచ్ఛత’ వెనుకడుగు!
ఇప్పటికీ ఆరుబయటకే..
- మరుగుదొడ్ల నిర్మాణంలో ఆటంకాలు
- మంజూరులోనూ అధికార పార్టీ వివక్ష
- పట్టణ ప్రాంతాల్లోనూ అవస్థలే..
- కాకిలెక్కలతో సరిపెడుతున్న అధికారులు
- రెండు రోజుల క్రితం పందుల దాడిలో గాయపడిన తల్లీకుమారుడు
1003
జిల్లాలోని పంచాయతీలు
340
స్వచ్ఛ భారత్ లక్ష్యం
150
లక్ష్యం పూర్తయిన పంచాయతీలు
మరుగుదొడ్డి నిర్మించుకోని ప్రజాప్రతినిధులు
19 మంది జెడ్పీటీసీ సభ్యులు
19 ఎంపీపీలు
479 మంది ఎంపీటీసీ సభ్యులు
581 మంది సర్పంచులు
6,075 మంది వార్డు మెంబర్లు
మరుగుదొడ్డి మంజూరు చేయలేదు
నేను కనగానపల్లి మండలంలోని దాదులూరు గ్రామ ఎంపీటీసీ సభ్యుడిని. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మంజూరు చేయడం లేదు. సరైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో సొంతంగా నిర్మాణాన్ని చేపట్టలేకపోతున్నా. ఈ పరిస్థితి నా ఒక్కడిదే కాదు.. నేను నివసించే ఎస్సీ కాలనీలో చాలా మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు.
- రామాంజినేయులు, ఎంపీటీసీ సభ్యుడు, దాదులూరు, కనగానపల్లి మండలం
‘మిషన్...స్వచ్ఛత వైపు ఒక్క అడుగు’ అంటూ ప్రభుత్వాలు ప్రచారం హోరెత్తిస్తుండగా.. జిల్లాలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడఽడం లేదు. రోడ్లను శుభ్రం చేసి ‘స్వచ్ఛ భారత్’ అంటూ నాయకులు గొప్పలు చెప్పుకుంటుండఽగా.. యంత్రాగం కూడా అంకెలతో గారడీ చేస్తూ వందశాతం లక్ష్యం చేరుకున్నట్లు గిమ్మిక్కులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోని జనం తప్పనిసరి పరిస్థితుల్లో బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా మరుగుకు నోచుకోని వారిలో చాలా మంది ప్రజాప్రతినిధులూ ఉండడం గమనార్హం.
- అనంతపురం సిటీ/న్యూసిటీ
అక్షర క్రమంలో ఆదిలో ఉన్న అనంతపురం జిల్లా ‘స్వచ్ఛత’లో మాత్రం అధమ స్థానంలో నిలుస్తోంది. జిల్లాలోని చాలా గ్రామాల్లోనే కాదు.. పట్టణాల్లోనూ వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోని జనం బహిర్భూమికి చెంబు పట్టుకుని వెళ్తున్నారు. దీనివల్ల రోగాలు వ్యాప్తి చెందడంతో పాటు ఆరుబయటకు వెళ్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. రెంఽడురోజుల క్రితం ఇలా బహిర్భూమికి వెళ్లిన అనంతపురం నగరంలోని చంద్రబాబు కాలనీకి చెందిన తల్లీబిడ్డపై పందిదాడి చేయడంతో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. జనం స్వచ్ఛందంగా మరుగదొడ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చినా అధికారులు మంజూరులో అలసత్వం వహిస్తుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
350 పంచాయతీలకే అవకాశం
జిల్లా వ్యాప్తంగా 3314 గ్రామాలు, 1003 గ్రామ పంచాయతీలున్నాయి. నాలుగేళ్ల్ల కాలానికి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు ప్రభుత్వం 350 పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. 2016 నుంచి 2017 నాటికి 150 గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తి చేశారు. అందుకు గాను ఆర్‌డబ్ల్యూఎస్ రూ.67 కోట్లు ఖర్చుచేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక 2017 నుంచి 2018 లోపు మరో 190 గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అప్పటి దాకా అటు గ్రామీణులు, ఇటు పట్టణ వాసులు మరుగులేక పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజాప్రతినిధులూ ఆరుబయటకే..
స్వచ్ఛత పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆరుబయటకే వెళ్తున్నారు. జిల్లాలో 19 మంది జెడ్పీటీసీలకు, 19 మంది ఎంపీపీలకు, 479 మంది ఎంపీటీసీలకు, 581 మంది సర్పంచులకు, 6075 మంది వార్డు మెంబర్లకు మరుగు దొడ్లు లేవు. గతేడాది ఈ లెక్కల వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మరుగుదొడ్లు లేని ప్రజాప్రతినిధులకు చెక్ పవర్‌ను రద్దు చేస్తానని హెచ్చరించారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు.
మరుగు దొడ్ల నిర్మాణాల్లో మాయాజాలం
జిల్లా వ్యాప్తంగా మరుగు దొడ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో పథకం లక్ష్యం నీరుగారి పోతోంది. చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టకుండానే ఎవరో ఒక లబ్ధిదారుడి పేరుతో డబ్బు డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అందువల్లే సాంకేతిక కారణాలను సాకుగా చూపి మరుగుదొడ్లకు జియో ట్యాగింగ్ చేయడం లేదని తెలుస్తోంది.
అంతా లెక్కల్లోనే
జిల్లాలోని 11 మున్సిపాలిటీలు, అనంతపురం నగరపాలక సంస్థలో వందశాతం లక్ష్యాలను అధిగమించామని అధికారులు లెక్కల్లో చూపారు. నిర్దేశించిన లక్ష్యంలో అనంతపురం నగరపాలక సంస్థ 98 శాతం, ధర్మవరం మున్సిపాలిటీలో 99 శాతం, గుత్తి 97, గుంతకల్లు 96, కదిరి 98, కళ్యాణదుర్గం 99, పామిడి 98, పుట్టపర్తి 98, రాయదుర్గం 95, మడకశిర 94, హిందూపురం 98, తాడిపత్రి మున్సిపాలిటీలో 100 శాతం మరుగుదొఽడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 90 శాతం లక్ష్యం చేరుకున్నట్లు రికార్డులు చెబుతుంటే... మరుగుదొడ్లు మంజూరు చేయాలని ఆయా మున్సిపాలిటీల ఎదుట జనం బారులు తీరుతున్నారు.
దరఖాస్తు చేసుకుంటే మంజూరు
మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి గతేడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాం. మరుగుదొడ్డి లేని వారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తారు.
– రవీంద్రబాబు, మున్సిపల్ ఆర్‌డీ