సాక్షి, రొద్దం: అవినీతి కాదేదీ అనర్హమంటున్నారు అధికార పార్టీ నాయకులు. ఏకంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకెళితే..మండలంలోని 19 గ్రామ పంచాయితీల్లోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 8700 మరుగుదొడ్లు మంజూరు కాగా 6,533 నిర్మాణాలను 2016 నుంచి 2019 ఫిబ్రవరి వరకూ విడతల వారీగా పూర్తి చేశారు. ఇందుకోసం రూ.9.78 కోట్ల చెల్లింపులు జరిగాయి.
మరుగుదొడ్డి కట్టకుండానే బిల్లు..
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను అధికార పార్టీ నాయకులే చేయించారు. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ చిన్నప్పయ్య పనులు చేశారు. మిగతా పంచాయతీల్లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. చాలా చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పునాదులు తీసి వాటిని పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు దిగమింగినట్లు తెలుస్తోంది.
ఇక పాతవాటికి కూడా బిల్లులు చేసినట్లు సమాచారం. ఒకే తలుపును మరుగుదొడ్లకు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా అవినీతి జరిగినట్లు సమాచారం. పెద్దగువ్వలపల్లి గ్రామంలోనే దాదాపు రూ.40 లక్షల దాకా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. బోగస్ బిల్లులు చేయడానికి ఒప్పుకోని ఒక ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి.
నాణ్యతకు పాతర..
మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకమైన ఇటుకలు వాడడంతోపాటు సిమెంట్ తగిన పాళ్లలో వాడలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక చాలావాటికి రింగులే ఇవ్వలేదు. నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతో లబ్ధిదారులు వాటిని వినియోగించడానికి కూడా భయపడుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment