టూరిజం హాబ్‌గా గోదావరి జిల్లాలు
నన్నయ వీసీ ఆచార్య ముత్యాలునాయుడు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఉభయ గోదావరి జిల్లాలను టూరిజం హాబ్‌గా తయారు చేసేందుకు అనేక అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ జిల్లాలు అతిథి మర్యాదలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నాయి కనుకనే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారన్నారు. ఏపీ టూరిజం సహకారంతో నన్నయ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పర్యాటకరంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను, సదుపాయాలను, వనరులను తెలియజేశారు. ఒక ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే క్యాబ్ డ్రైవర్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. క్యాబ్ డ్రైవర్లు తమ ప్రవర్తనతో పర్యాటకులను ఆకుట్టుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన యూనివర్సిటీ అకడమిక్ డీన్ ఆచార్య ఎస్.టేకి మాట్లాడుతూ ఒకసారి వచ్చిన ప్రయాణికుడు మళ్లీ వచ్చేందుకు ఆసక్తిని చూపించేలా మీ నడవడిక, ప్రవర్తన ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన నియమావళి, టూరిజం పద్ధతులు, ప్రాథమిక చికిత్స విధానం, కమ్యూనికేషన్, ట్రాఫిక్ రూల్స్ అనే ఐదు అంశాలపై ఈ శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వారికి కిట్‌తోపాటు రూ.500 పారితోషికం, స్టిక్కర్లు అందజేశారు. ప్రోగ్రామ్ అధికారి శశాంక్, మేనేజ్‌మెంట్ అధ్యాపకులు కె.సాయిబాబా, ఐ.ఎస్.ఎస్.రాజు, రాజేంద్రప్రసాద్, పద్మవళ్లి, డాక్టర్ ఎం.రమేష్, జి.అలీస్‌జాయ్, ఎ.శ్రీనివాస్, జె.రవిశంకర్ పాల్గొన్నారు.