ఇసుక ట్రాక్టర్ బోల్తా
-
కూలీ మృతి, డ్రైవర్ పరారు
ఎగువపల్లి (సోమశిల) : అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడి కూలీ మృతి చెందిన సంఘటన అనంతసాగరం మండలంలోని ఎగువపల్లి సమీపంలో బుధవారం జరిగింది. సోమశిల ఎస్‌ఐ ఎంఎస్ రాకేష్ కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ పురపాలక పరిధిలోని మడకరవారిపల్లికి చెందిన ట్రాక్టర్ మండలంలోని పీకేపాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుకను తీసుకెళ్తుండగా ఎగువపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కూలీ చిట్టిబోయిన సుధాకర్ (28) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.