ట్రాక్టర్ ట్రక్కు బోల్తా : యువకుడి మృతి
-
మరొకరికి గాయాలు
కోట : ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడారు. ఈ సంఘటన మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. చంద్రశేఖరపురానికి చెందిన కయ్యాల వెంకటేశ్వర్లు (18), తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ ముమ్మడి వెంకటేశ్వర్లుతో కలిసి తోడుగా ట్రాక్టర్‌లో వెళ్లాడు. పనులు ముగించుకుని చిట్టేడు నుంచి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్ బోల్తాపడటంతో అందులో కూర్చుని ఉన్న కయ్యాల వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ముమ్మడి వెంకటేశ్వర్లును 108 సిబ్బంది చికిత్స కోసం గూడూరుకు తరలించారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు రవీంద్ర, రాధమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. వెంకటేశ్వర్లు విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితునికి తోడుగా వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై అజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.