వెళ్లిపో జెట్టకమ్మ.. వెళ్లిపో..!
దారిద్య్రాన్ని కలిసికట్టుగా సాగనంపిన రైతులు
ఖానాపూర్: గ్రామానికి పట్టిన దరిద్రం వదిలిపోవాలనే ఆకాంక్షతో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, తిమ్మాపూర్‌గ్రామాభివృద్ధి కమిటీలు 20 ఏళ్ల కిందట వదిలేసిన ఓ ఆచారాన్ని ఆదివారం మళ్లీ పాటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల రైతులు, ప్రజలు జెట్టకమ్మ(దారిద్య్రం) దిష్టిబొమ్మను తయారుచేసి భారీ ఊరేగింపు నిర్వహించారు.
డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో ఆదివారం జెట్టకమ్మ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్ గ్రామాల ప్రజలు జెట్టకమ్మను వారి గ్రామం నుంచి శివారు ప్రాంతమైన ఖానాపూర్‌లో వదిలివేశారు.
దీంతో ఖానాపూర్ వచ్చిన జెట్టకమ్మను వీడీసీల ఆధ్వర్యంలో ఖానాపూర్ మీదుగా శివారులోని దిలావర్‌పూర్ పొలిమేరలోకి ఇక్కడి రైతులు పారద్రోలారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామపెద్దలు తెలిపారు. కొందరు మగవాళ్లు ఆడవాళ్ల వేషధారణతో పాల్గొన్నారు.