నిడదవోలు.. జనం ఘొల్లు
నిడదవోలు.. జనం ఘొల్లు
Published Wed, Oct 12 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని గూడెం రైల్వేగేటు వద్ద ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. తాడేపల్లిగూడెం–రాజమండ్రికి దగ్గరదారి కావడంతో ఇటుగా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది రైల్వే మెయిన్ లైన్ కావడబంతో రోజూ 200 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో సగటున రోజుకు 150 సార్లు రైల్వే గేటు వేస్తున్నారు.
రోజూ 200 రైళ్లు
నిడదవోలు మీదుగా రోజుకు సుమారు 200 రైళ్లు విజయవాడ, విశాఖ వైపునకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేటు వేయాల్సి వస్తోంది. దీంతో రోజుకు సగటున 150 సార్లు గేటు పడుతుంది. ఈ సమయంలో వాహనాల రద్దీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. గేటు పడినప్పుడల్లా కనీసం 20 నిమిషాల సమయం వథా అవుతోంది. గేటు వేసేటప్పుడు, తీసేటప్పుడు కనీసం సిబ్బంది ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్వేగేటును వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికితోడు రైల్వేగేటు తరచుగా మోరాయించడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొన్నిసార్లు పట్టణంలో పోలీస్‌స్టేషన్ వరకు, గేటుకు అవతల బసివిరెడ్డిపేట వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి.
అధికారులు ప్రతిపాదించిన నమూనా..
సామర్లకోట బ్రిడ్జిని పోలిన నమూనాను అధికారులు ఇక్కడ రూపాందించారు. ప్రస్తుతం ఉన్న రైల్వేగేటుకు విజయవాడ వైపునకు 100 మీటర్ల దూరంలో రైల్వేట్రాక్ పైనుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు రైల్వేట్రాక్ నుంచి సుమారు 95 మీటర్ల పొడవునా ఫోర్ లైన్ బ్రిడ్జికి ప్రతిపాదించారు. దీనిని అనుసంధానం చేస్తూ ఇక్కడ నుంచి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలోకి, తాడేపల్లిగూడెం వైపు, సమిశ్రగూడెం కాలువ పైకి ఆర్మ్‌లు నిర్మించాల్సి ఉంది. అయితే ఆర్వోబీ నిర్మాణం కలగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా రూ.135 కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గూడెం గేటు వద్ద ఆర్వోబీ నిర్మిస్తే తప్ప పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు.
Advertisement