హంద్రీకాలువ వద్ద యువకుల జాడ కోసం వెదుకుతున్న దశ్యం
పత్తికొండ పట్టణంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలో బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
– పుష్కర స్నానానికి వెళ్లి పెళ్లి కుమారుడు తమ్ముడు, బావమరిది గల్లంతు
– పత్తికొండలో ఘటన
పత్తికొండ టౌన్: పత్తికొండ పట్టణంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలో బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పత్తికొండ పట్టణం తేరుబజారులో నివాసం ఉంటున్న ఆర్టిస్టు మోహన్ అన్న బ్రహ్మనందరాజు కడప జిల్లా బద్వేలులో నివాసముంటున్నారు. బ్రహ్మనందరాజు మొదటి కుమారుడు రవికుమార్ వివాహం ఈనెల 21న కడపలో జరిగింది. వారి బంధువులంతా పత్తికొండలో ఉండటంతో తిరుగు పెళ్లి సోమవారం మోహన్ ఇంట్లో నిర్వహించారు. మంగళవారం ఉదయం పుష్కరాలు చివరి రోజు కావడంతో బ్రహ్మనందరాజు రెండో కుమారుడు పదో తరగతి చదువుతున్న జ్ఞానేశ్వర్ (16), రాజంపేటకు చెందిన మోహన్ చెల్లెలు వాణి కుమారుడు ఇంటర్ సెంకడియర్ చదువుతున్న తేజ(18), మరో ముగ్గురు యువకులు హంద్రీనీవా ప్రధాన కాల్వకు చేరుకున్నారు. కాల్వలో దిగి స్నానాలు చేస్తుండగా నీటి ప్రవాహం అధికమైంది. దీంతో నలుగురు యువకులు కొట్టుకుపోతుండగా అటువైపు స్నానం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు పల్లెప్రతాప్‌రెడ్డితో పాటు మరికొందరు యువకులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా తేజ, జ్ఞానేశ్వర్ మాత్రం గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగానే ఇద్దరు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కాలువ గట్టు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకులు నీటిలో గల్లంతు కావడంతో వారి తల్లులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. సమాచారం అందుకున్న సీఐ బివి.విక్రంసింహ పోలీసు సిబ్బందితో కాలువ వద్దకు వచ్చి గల్లంతైన యువకుల జాడ కోసం యత్నించారు. పలువురిని నీటిలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు.