
సాక్షి, బెంగళూరు: నిన్నే పెళ్లిచేసుకుంటా, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని రావాలని యువతి వేధిస్తుండడంతో తట్టుకోలేక యువకుడు ఇల్లు వదిలి పరారయ్యాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా హరవాళ గ్రామానికి చెందిన మారప్ప అనే యువకుడు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాడు. గతంలో బీదర్ జిల్లాలో పెళ్లి చూపుల్లో ఓ యువతిని చూశాడు. అయితే ఆమె తిరస్కరించడంతో తిరిగి వచ్చేశాడు.
తరువాత కొంతకాలానికి మరో యువతితో అతనికి పెల్లి సంబంధం కుదిరింది. ఈ క్రమంలో గతంలో చూసిన అమ్మాయి మారప్పకు క నబడటంతో ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని కాల్స్, మెసేజ్‌లు చేసుకునేవారు. కొన్నిరోజుల తరువాత మారప్పకు నిశ్చితార్థమైన విషయం తెలుసుకున్న యువతి అతనికి రోజూ ఫోన్ చేసి నీవంటే ఇష్టమని చెప్పడం మొదలు పెట్టింది. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని, తననే పెళ్లి చేసుకోవాలంటూ పోరుపెట్టేది.
దీంతో యువతి వేధింపులు తాళలేక యువకుడు ఇల్లు వదిలిపెట్టి ఉడాయించాడు. ఐదు పేజీల లేఖ రాసి, మొబైల్‌ను కూడా ఇంట్లో వదిలేశాడు. అతని తల్లిదండ్రులు కుమారుని కోసం కన్నీరుపెడుతున్నారు. దీనిపై నెలగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment