పర్యవేక్షణా లేదూ..ముందు చూపూ లేదు
-
అమలుకాని వైద్య ప్రణాళికలు
-
భర్తీ కాని పోస్టులు
-
నిలిచిపోయిన దోమతెరల పంపిణీ
-
ఇదీ ఏజెన్సీలో వైద్య సేవల పరిస్ధితి
రంపచోడవరం :
ఏజెన్సీలో మలేరియా, విషజ్వరాలతో గిరిజనులు ప్రాణాలు కోల్పోయినపుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హడావుడి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా సాధారణ పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యసేవలు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ లోతుగా అధ్యయనం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించే అధికారులు ఏజెన్సీలో కానరావడం లేదు. ఏటా సీజనల్‌గా వచ్చే వ్యాధులపై సమగ్ర ప్రణాళిను కూడా అమలు చేయడం లేదు. ఫలితంగా మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇంటింటి పరిశీలన జరగడం లేదు
ఏజెన్సీ 11 మండలాల్లో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు( పీహెచ్‌సీ) ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఆరు సబ్‌సెంటర్లు ఉంటాయి. ప్రతి సబ్ సెంటరుకు ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్తా ఉంటారు. వీరి పనిని పరిశీలించేందుకు మగ, ఆడ పర్యవేక్షకులు ఉండాలి. ఇంత పెద్ద వైద్య వ్యవస్థ ఉన్నప్పటికీ, మారుమూల గ్రామాల్లో ప్రబలుతున్న వ్యాధుల గురించి బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఏఎన్‌ఎంలు సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య విషయాలు, రక్త నమూనాలు సేకరించాలి. వ్యాధులు ఎక్కువగా నమోదైతే పీహెచ్‌సీకి సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన పర్యవేక్షకులు స్థానికంగా నివాసం ఉండడం లేదు. దూర ప్రాంతాల్లో ఉంటూ విధులకు హాజరు కావడం వల్ల వారు పూర్తిస్థాయిలో గ్రామాలను సందర్శించడం లేదు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాల సందర్శనకే పరిమితం అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్త ఉంటారు. ఆ గ్రామ బాధ్యత ఆశాలపై నెట్టివేస్తున్నారు. వారికి కనీసం గౌరవ వేతనం కూడా సక్రమంగా చెల్లించడం లేదు.
వేధిస్తున్న వైద్యుల కొరత
ఏజెన్సీ 11 మండలాల్లోని పీహెచ్‌సీల్లో 57 మంది వైద్యులు పనిచేయాలి. సుమారు 10 వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక డాక్టర్‌కు రెండు పీహెచ్‌సీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఫలితంగా రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందడం లేదు. వివిధ స్థాయిలో స్టాఫ్ నర్సులు, ఎంపీఎంఓలు, ఫార్మాసిస్టులు, ఎంపీహెచ్‌ఏ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. విలీన మండలాల్లో వివిధ పోస్టుల్లో 221 మంది సిబ్బంది పనిచేయాలి. వాటిలో 79 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీహెచ్‌సీలకు ఈ–ఔషదం ద్వారా ఆన్‌లైన్‌లో మందులు సరఫరా చేస్తున్నారు. అయితే ఏజెన్సీలోని చాలా పీహెచ్‌సీలకు నెట్ సదుపాయం లేదు. మందుల ఇండెంట్ పెట్టేందుకు ఫార్మాసిస్టులు లేరు. నెల్ సౌకర్యం ఉండి ఇండెంట్ పెట్టినా సెంట్రల్æడ్రగ్ స్టోర్ నుంచి రెండు నెలలకు గాని మందులు రావడం లేదు.
మూడేళ్లుగా దోమతెరలు రాలేదు
ఏజెన్సీలో మూడేళ్లుగా దోమతెరల పంపిణీ జరగడం లేదు. 2012లో లక్షా 60 వేల దోమతెరలు పంపిణీ చేశారు. తరువాత వాటి అవసరం ఉన్న సరఫరా మాత్రం జరగలేదు. 2014, 2015 సంవత్సరాల్లో దోమతెరల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకపోయింది. దోమతెరల పంపిణీతో పాటు వాటి వినియోగంపై అవగాహన కలిగించడం కూడా ఎంతో అవసరం.ఈ ఏడాది దోమతెరల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటì æవరకూ రాలేదు. జిల్లా మలేరియా కార్యాలయం అధికారులు ఫ్యామిలీ, డబుల్, సింగిల్ సైజ్ అనే మూడు రకాల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపించారు.
మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలతో పాటు ఏజెన్సీ అంతటా పంపిణీ చేసేందుకు 3 లక్షల 60 వేల దోమతెరలకు ప్రతిపాదనలు పంపించారు. ఏజెన్సీలో మలేరియా విభృజిస్తునప్పటికీ దోమతెరలు మాత్రం రాలేదు. మలేరియా సీజన్‌లోనే దోమతెరలను పంపిణీ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.