ఏజెన్సీలో ఆగని మృత్యుఘోష
-
కాళ్లవాపుతో మరో గిరిజన మహిళ మృతి
-
కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం
-
ఏడుకు చేరిన మృతుల సంఖ్య
-
భయంతో గిరిజనం
-
ఊరటనివ్వని యంత్రాంగం చర్యలు
చింతూరు :
ఏజన్సీలో మృత్యుఘోష ఆగడం లేదు. విలీన మండలాలను పట్టి పీడిస్తున్న కాళ్లవాపు వ్యాధితో వీఆర్‌పురం మండలంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా తాజాగా చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన బందం సుబ్బమ్మ (60) అనే గిరిజన మహిళ కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. బొడ్రాయిగూడెంకు చెందిన సుబ్బమ్మ వారం రోజులక్రితం చట్టిలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా జ్వరం రావడంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు జ్వరంతోపాటు రక్తహీనత, కాళ్లవాపు లక్షణాలు కనిపించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటినుంచి కాకినాడలో చికిత్స పొందుతున్న సుబ్బమ్మ పరిస్థితి శుక్రవారం ఒక్కసారిగా విషమించడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పెద్దాసుపత్రికి వెళ్లినా...
కాళ్లవాపు వ్యాధి మూలాలను ఇంతవరకూ వైద్యులు గుర్తించకపోవడంతో రోగుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాళ్లవాపును నివారించేందుకు అధికారులు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లాకు పెద్ద దిక్కయిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పెద్దాసుపత్రికి వెళుతున్నాం ... నయమవుతుందని ఆశపడిన బాధితులకు నిరాశే ఎదురవుతోంది. పెద్దాసుపత్రిలో సైతం చికిత్స పొందుతూ తమవారు మృత్యువాత పడడం వారి కుటుంబసభ్యులను కుంగదీస్తోంది. వీఆర్‌పురం మండలం చిన్నమట్టపల్లికి చెందిన కారం రామారావు, తమ్మయ్యపేటకు చెందిన ముసురు వెంకటస్వామిలు కాకినాడ ఆసుపత్రిలో రెండ్రోజులపాటు చికిత్స పొందిన అనంతరం మృతిచెందగా తాజాగా చింతూరు మండలం బొడ్రాయిగూడెంకు చెందిన సుబ్బమ్మ ఆరు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మృతిచెందింది. మరోవైపు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వ్యాధి తగ్గిందని స్వస్థలాలకు పంపిన వారికి తిరిగి వ్యాధి తిరగబెడుతుండడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలం మామిళ్లగూడెంకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురవగా మరోమారు కాకినాడ తరలించి వ్యైదం అందిస్తున్నారు. కాళ్లవాపు వ్యాధి అదుపులోకి రాకపోవడంతో విలీన మండలాలకు చెందిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. రానురాను మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని, వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు వేడుకుంటున్నారు.