జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్
సంగారెడ్డి జోన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 31వ తేదిన నిర్వహించనున్న ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ తెలిపారు. కలెక్టరెట్‌లో శుక్రవారం రాత పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 31న ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరువు, రాంచంద్రపురంలో మొత్తం 34 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 14,609 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఆ రోజు ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతుందని చెప్పారు.
పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా, మంచినీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైన గుర్తింపుకార్డును విధిగా తెచ్చుకోవాలన్నారు. ఎలక్ర్టానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యేవారు షూష్, జువెల్లరీ, ష్రగ్స్ ధరించకూడదన్నారు. పోలీసు బందోబస్తుతో పాటు ఇప్పటికే ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరెట్ పరిపాలనా అధికారి మహిపాల్‌రెడ్డి తదితరులున్నారు.