Game On Movie Review Telugu: సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఆన్‌’ మూవీ ఎలా ఉందంటే.. | Game On 2024 Telugu Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Game On Movie Review Telugu: సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఆన్‌’ మూవీ ఎలా ఉందంటే..

Published Fri, Feb 2 2024 9:40 AM | Last Updated on Fri, Feb 2 2024 11:17 AM

Game On Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: గేమ్‌ ఆన్‌
నటీనటులు: గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీనన్‌, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
నిర్మాత: రవి కస్తూరి
దర్శకత్వం: దయానంద్‌
సంగీతం: అభిషేక్‌ ఏఆర్‌(బీజీఎం), నవాబ్‌ గ్యాంగ్‌, అశ్విన్‌ అరుణ్‌(పాటలు)
సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వనాథ‌న్‌
ఎడిటర్‌: వంశీ అట్లూరి
విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024

కథేంటంటే..
గౌతమ్‌ సిద్ధార్థ్‌ అలియాస్‌ సిద్ధు(గీతానంద్‌) ఓ గేమింగ్‌ కంపెనీలో పని చేస్తుంటాడు. అదే సంస్థలో పని చేసే మోక్ష(వాసంతి)తో ప్రేమలో ఉంటాడు. టార్గెట్‌ సరిగా పూర్తి చేయకపోవడంతో అతన్ని ఉద్యోగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకి బ్రేకప్‌ చెప్పి.. అతని ఫ్రెండ్‌ రాహుల్‌(కిరీటీ)తో వెళ్లిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో సిద్దు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకి ఫోన్‌ వస్తుంది. ‘నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్‌లో వేస్తాం’అని చెబుతాడు. సిద్ధు ఈగను చంపగానే..అకౌంట్‌లోకి రూ.లక్ష క్రెడిట్‌ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమించి ఇంటికెళ్తాడు. ఆ తర్వాతి మళ్లీ కాల్‌ చేసి..‘ఇదొక సైకలాజికల్‌ గేమ్‌ షో అని, చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు పంపిస్తామని చెబుతారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. అతని జీవితంలోకి తార(నేహా సోలంకి) వస్తుంది.

ఇలా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో గేమ్‌లో భాగంగా  ఓ వ్యక్తిని చంపాలని ఫోన్‌ కాల్‌ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్‌ని పూర్తి చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధుకి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సైకాలజిస్ట్‌ మదన్‌ మోహన్‌(ఆదిత్య మీనన్‌)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు గతమేంటి? తాత సూర్య నారాయణ(సుభలేఖ సుధాకర్‌) ఎలా చనిపోయాడు? అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అర్చన(మధుబాల)కి సిద్ధుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు జీవితంలోకి తార ఎలా వచ్చింది? అసలు ఆమె నేపథ్యం ఏంటి? రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి వెళ్లిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే...
ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ. ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్‌ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది ఈ సినిమా ఇత్తివృత్తం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా  మారాడు అనేది కాస్త ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దయానంద్‌. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్‌ని చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంత వరకు మాత్రమే సఫలం అయ్యాడు. 

కాన్సెప్ట్‌ కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. కథనంలో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తంలో తొమ్మిది టాస్క్‌లు ఉంటాయి. వాటిని మరింత బలంగా చూపిస్తే బాగుంటుంది. ఎంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నా..తెరపై చూస్తే కొంచెం అయినా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. గేమ్‌ ఆన్‌లో అది మిస్‌ అయింది. అయితే కొన్ని చోట్ల మాత్ర ఎమోషన్స్‌ బాగా వర్కౌట్‌ అయింది. అలాగే యూత్‌ని ఆకట్టుకునే రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. 

ఓ క్రైమ్‌ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ పదేళ్లు ముందుకు జరుగుతుంది.ఓ లూజర్‌గా హీరోని పరిచయం చేయించాడు దర్శకుడు. ఉద్యోగం పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో హీరో క్యారెక్టర్‌పై జాలీ కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక్కసారి ఆన్‌లైన్‌ గేమ్‌ ప్రారంభం అవ్వగానే.. ప్రేక్షకులకు కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈజీ టాస్కులకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో..ఏదో జరగబోతుందనేది ప్రేక్షకుడికి తెలిసినా.. అది ఏంటనే క్యూరియాసిటీ మాత్రం చివరి వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. 

ఫన్నీ టాస్క్‌లు.. రొమాంటిక్‌ సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.హీరో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. గేమ్‌లోని టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా..గేమ్‌ ఆన్‌ మాత్రం కాస్త డిఫరెంట్‌ మూవీ అనే చెప్పొచ్చు. 

ఎవరెలా చేశారంటే..
గౌతమ్‌ సిద్ధార్థ్‌ పాత్రలో గీతానంద్‌ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. తారగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్‌గా కనిపించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది.గీతానంద్‌, నేహ సొలంకిల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ మధుబాల డిఫరెంట్‌ పాత్ర పోషించి మెప్పించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు ఎలాంటి సన్నివేశాలు ఉండవు. సైకాలజిస్ట్‌ మదన్‌ మోహన్‌గా ఆదిత్య మీనన్‌ అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్‌ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించాడు. వాసంతి, కిరిటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాకేంతికంగా ఈ సినిమా బాగుంది. అభిషేక్‌ ఏఆర్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. నవాబ్‌ గ్యాంగ్‌, అశ్విన్‌ అరుణ్‌ పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement