గిరిజన విద్యార్థులను ప్రభుత్వం చులకనభావంతో చూస్తోందని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు వాపోయారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : గిరిజన విద్యార్థులను ప్రభుత్వం చులకనభావంతో చూస్తోందని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు వాపోయారు. గిరిజన విద్యార్థులకు గ్రూప్–1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో డిగ్రీలు, పీజీలు చేసిన గిరిజన యువకులు ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయ కూలీలుగా, ఆటో కార్మికులుగా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు.
ఇటీవల ఏపీ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి ఎస్సీ, బీసీ ,మైనార్టీ అభ్యర్థులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని, గిరిజన అభ్యర్థులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారిని కలిసిన వారిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి రాజునాయక్, గిరిజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి సాకే చిరంజీవి, నాయకులు భరత్, భాస్కర్‌నాయక్ ఉన్నారు.