ఓ అనాథ గిరిజన బాలిక ఆవేదన
గర్నికం (రావికమతం): ‘చదువుతోటే వెలుగు. బడిఈడు పిల్లలు అంతా చదువుకోవాలి. మధ్యలో బడి మానేసిన చిన్నారులు మళ్లీ పాఠశాలలకు వెళ్లాలి’ అంటూ విద్యాశాఖ ఇటీవల పాఠశాలల ప్రారంభం సమయంలో ఊరూరా ప్రచారం చేసింది. ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లి మరీ పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. చదువు మధ్యలో మానేసిన చిన్నారులు బడికి వెళ్లేలా ప్రోత్సహించారు.
అయితే రావిక మతం మండలం గర్నికంలో తల్లిదండ్రులు దూరమయ్యారన్న బెంగతో బడి మధ్యలో మానేసిన గిరిజన, అనాథ బాలిక పాఠశాలకు వెళ్లి నాకు సీటు ఇవ్వండి చదుకుంటానంటే ప్రిన్సిపల్ నిరాకరించారు. పైగా.. ఎమ్మెల్యేతో చెప్పించండి సీటు ఇస్తాం అంటూ సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళితే...గర్నికం గ్రామానికి చెందిన అనాథ గిరిజన బాలిక వాలిశెట్టి తరుణి(12) బంధువుల వద్ద ఉంటోంది. ఈమె తండ్రి రామకృష్ణ గర్నికం వీఆర్‌ఏగా పనిచేస్తూ రెండు నెలల క్రితం మృతిచెందారు.
అతని భార్య కూడా ఆరు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో తరుణి అనాథగా మారింది. అప్పటి వరకూ గర్నికం కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో చదివిన ఈమె తల్ల్లీతండ్రి మృతితో బెంగపడి పాఠశాలకు వెళ్లకుండా నాయనమ్మ వద్ద ఉండిపోయింది. చదువుకోవాలనే కోరికతో తరుణి బంధువులతో కలసి ఇటీవల పాఠశాలకు వెళ్లింది. తీరా వెళ్లాక నీ పేరు తొలగించాం.. ఎమ్మెల్యే సిఫార్స్ చేస్తే మళ్లీ చేర్చుకుంటాం అంటూ ప్రిన్సిపల్ సుధ చెప్పారు.
దీంతో తరుణి మేనమామ నూకరాజు చోడవరం ఎమ్మెల్యే రాజును కలిసి విషయం విన్నవించారు. గర్నికం టీడీపీ నాయకునితో నాకు చెప్పించండి అంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చి పంపేశారు. తీరా ఆ గ్రామ టీడీపీ నాయకుడిని కలవగా అసలు తమ గ్రామంలో గిరిజనులే లేరని.. తానెలా ఎమ్మెల్యేకు చెబుతామంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన తరుణి బంధువులు బాలికతో కలసి సీటుకోసం గురువారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు.
దీనిపై విలేకరులు పాఠశాల ప్రిన్సిపాల్ సుధను సంప్రదించగా తాను ఇటీవలే జాయిన్ అయ్యాను, స్కూల్‌లో ఉన్న 200 సీట్లూ నిండాయి, తొలి జాబితా ఈ నెల 15న ప్రకటించగా తరుణి 23న స్కూల్‌కు వచ్చిందని చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యే సిఫార్స్‌లేఖతో వస్తే రిక్వెస్ట్ సీటు ఇస్తామన్నారు. అది కూడా యూనిఫాం, ఉపకార వేతనం ఇవ్వబోమని సూచించారు. దీనిపై తరుణి బంధువులు మండిపడుతున్నారు. అనాథ బాలిక చదువుకుంటానంటే ఇంత రాజకీయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును కలెక్టర్‌ను కలిసి చెప్పుకుంటామని చెప్పారు.
చదువుకుంటా సీటివ్వండి
Published Fri, Jul 1 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM
Advertisement