తుపాకీతో కాల్చుకుని గిరిజనుడు ఆత్మహత్య
బుట్టాయగూడెం : మండలంలోని చింతలగూడెంలో ఒక గిరిజన యువకుడు ఆదివారం నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చింతలగూడెంకు చెందిన కొండరెడ్డి యువకుడు మిర్తివాడ సురేంద్రరెడ్డి (28)వ్యవసాయ కూలీ. అతనిని భార్య సుబ్బలక్షి్మ మద్యం మానాలని పోరడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ సమయంలో భర్తతో గొడవపడి సుబ్బలక్ష్మి అమ్మపాలెంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సురేంద్రరెడ్డి ఇంటిలో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. భార్య కాపురానికి రావడం లేదనే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు. సురేంద్రరెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఘటనా స్థలంలో దొరికింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, తన తల్లిని, అన్నను క్షమించాలని అందులో ఉంది. తన మరణం గురించి పోలీసులకు చెప్పవద్దంటూ రాసి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సురేంద్ర మృతి తర్వాత నాటు తుపాకీని అతని సోదరుడు రవిరెడ్డి లంకాలపల్లి వెళ్ళే రహదారిలోని ఒక ప్రదేశంలో దాచి ఉంచడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేంద్రరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సురేంద్ర సోదరుడు రవిరెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై డి.నరసింçహారావు తెలిపారు. కాగా భర్త మరణ వార్త విన్న సుబ్బలక్ష్మి హుటాహుటిన చింతలగూడెం చేరుకుంది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.