సీఎంతో సమీక్షలో జిల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల అభిప్రాయం
♦ గార్లను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి..
♦ ఇల్లెందును కొత్తగూడెం పరిధిలోకి తేవాలి..
♦ ‘గూడెం’ కేంద్రంగా భద్రాద్రి జిల్లా పేరు పెట్టాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘పోలవరం ముంపు వల్ల జిల్లాలోని ఐదు మండలాలను పూర్తిగా కోల్పోయాం. మరో రెండు మండలాల్లోని కొన్ని గ్రామాలను వదులుకున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడు ఇల్లెందు, గార్ల, బయ్యారం మండలాలను వదులుకోం. వీటిని మా జిల్లాలోనే ఉంచాలి. వాజేడు, వెంకటాపురం మండలాలు.. భద్రాచలం నియోజకవర్గంలోనే ఉండాలి’ అని టీఆర్‌ఎస్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ముఖ్య ప్రజాప్రతినిధులు సూచించారు. రాజధానిలో సీఎం నేతృత్వంలో నూతన జిల్లాలపై బుధవారం జరిగిన ఆ పార్టీ రాజకీయ సమీక్షలో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నూతన జిల్లా, కొత్త మండలాలపై జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలపై జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గార్ల, ఇల్లెందు, బయ్యారం మండలాలను కొత్తగా ఏర్పడనున్న మహబూబాబాద్ జిల్లాలోనే ఉంచాలని అక్కడి ఎమ్మెల్యేలు సమీక్షలో లేవనెత్తారు. దీనిపై జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ మాట్లాడుతూ 46 మండలాలతో ఉన్న ఖమ్మం జిల్లా పోలవరం ముంపునకు 5 మండలాలు పోవడంతో.. ఇప్పుడు 41 మండలాలు మిగిలాయని, మళ్లీ ఈ మూడు మండలాలను వదులుకోం.. అవి మాకే ఉండాలి.
గార్ల ఖమ్మంకు సమీపంలోనే ఉంటుంది. దీనిని ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉంచాలని ఏకగ్రీవ తీర్మానం. అలాగే కామేపల్లిని ఖమ్మం జిల్లా పరిధిలోకి, ఇల్లెందును కొత్తగూడెం జిల్లా పరిధిలోకి తీసుకురావాలి.
ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం నియోజకవర్గంతోపాటు పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలు పూర్తిగా ఉండాలి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండల పరిధిలోకి కామంచికల్, దారేడు గ్రామాలను కలపాలని నిర్ణయం. అలాగే కార్పొరేషన్ పరిధిలోకి 49,50 డివిజన్లు తీసుకురావాలని నిర్ణయించారు.
కొత్తగూడెం జిల్లాలోకి కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలతోపాటు ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలు రానున్నాయి.
కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి పేరును కొత్త జిల్లాకు పెట్టాలి. వాజేడు, వెంకటాపురం మండలాలను కూడా భద్రాచలం నియోజకవర్గంలోనే ఉంచాలని ప్రతిపాదించారు. అయితే జిల్లా అధికారులు ప్రతిపాదించిన దాంట్లో కూడా ఈ రెండు మండలాలు భద్రాచలం నియోజకవర్గంలోనే ఉన్నాయి.
గుండాల మండలంలో ఆళ్లపల్లి, పినపాక మండలం కరకగూడెం, పాల్వంచ రూరల్, కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేయనున్నారు. వీటికి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అందరూ ఆమోదం తెలిపారు.
చివరికి జిల్లాలవారీ సమీక్షలో బయ్యారం మండలాన్ని మహబూబాబాద్‌లోనే ఉంచాలని అక్కడి ప్రజాప్రతినిధులు రాష్ట్ర పార్టీకి నివేదించినట్లు తెలిసింది. అయితే గార్ల ఖమ్మం జిల్లాలో.. ఇల్లెందును కొత్తగూడెం జిల్లాలో కచ్చితంగా ఉంచాలని జిల్లా ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీకి చెప్పారు. బయ్యారం కొత్తగూడెం జిల్లా పరిధిలోకి రానుందా? లేక మహబూబాబాద్‌లోకి వెళ్లనుందా? అనేది జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
ఇల్లెందు, టేకులపల్లి మండలాలు కలుపుకుని కొత్తగూడెం జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. అదనంగా మరో నాలుగు మండలాలు వస్తాయి. ప్రస్తుతం 18 మండలాలతో కొత్తగూడెం జిల్లా పరిధిలోకి 11,38,910 మంది జనాభా, 8,044.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. కొత్తగా నాలుగు మండలాలు పెరిగినా జనాభా, విస్తీర్ణంలో మార్పు ఉండదు.
గార్ల, కామేపల్లి మండలాలు ఖమ్మం జిల్లా పరిధిలోకి తెస్తే 22 మండలాలు కానున్నాయి. గార్లను మినహాయిస్తే ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిధిలోకి 21 మండలాలను కలిపితే 14,35,034 మంది జనాభా, 4,613.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. గార్ల ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తే జనాభాతోపాటు విస్తీర్ణం పెరగనుంది.
మూడు ముక్కలు కానున్న ఇల్లెందు
ఒక నియోజకవర్గంలోని మండలాలు ఇతర జిల్లాలో ఉన్నా ఇబ్బందులేమీ ఉండవని సీఎం కేసీఆర్ సమీక్షలోనే ప్రస్తావించడంతో ఇల్లెందు నియోజకవర్గం మూడు ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇల్లెందు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇల్లెందు పట్టణంతోపాటు మండలం, గార్ల, బయ్యారం, టేకులపల్లి, కామేపల్లి మండలాలున్నాయి. సమీక్షలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గార్ల, కామేపల్లిని ఖమ్మం జిల్లా పరిధిలోకి తేవాలని, ఇల్లెందు, టేకులపల్లిని కొత్తగూడెం జిల్లాలో కలపాలని చెప్పారు. బయ్యారంను కూడా ఇక్కడే ఉంచాలని తొలుత పట్టుపట్టినా.. తర్వాత మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి తెస్తే బాగుంటుందని వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కోరడంతో.. దీనిపై చివరకు జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా అభ్యంతరం చెప్పలేదని తెలిసింది. ఈ పరిస్థితులతో బయ్యారం మహబూబాబాద్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఇల్లెందు నియోజకవర్గంలోని మండలాలు మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
సమీక్ష సమావేశంలో జిల్లా తరఫున రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, పాయం వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య పాల్గొన్నారు.