( ఫైల్ ఫోటో )
ఎన్నికలు రావడానికి ముందుగా తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఏదో ఒక సెంటిమెంట్ కలిసిరావాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాని, మరికొందరు టీఆర్‌ఎస్ నేతలు కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయాన్ని అటువైపు మళ్లించే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. క్లౌడ్ బరస్ట్, పోలవరం వల్ల భద్రాచలం మునిగింది తదితర వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి.పోలవరం ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా స్పందించడంతో అది పెద్ద చర్చగా మారింది. మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ కు కేంద్రం నో చెప్పింది.. వీటి గురించి చర్చించుకుంటే ఆసక్తికర విశ్లేషణలు వస్తాయి. క్లౌడ్ బరస్ట్ అంటే కుంభ వృష్టి.ఈ వృష్ఠి ఆకస్మిక వరదలు రావడానికి ఇతరదేశాలు ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అన్న అనుమానాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు.
అది తన అభిప్రాయంగా నేరుగా చెప్పకపోయినా, కొందరు అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నమ్మితేనే చెబుతారని అంతా అనుకుంటాం. కేసీఆర్ ఏమీ సాధారణ వ్యక్తికాదు. పైగా ఆయనకు అపారమైన పుస్తకాల నాలెడ్జ్ ఉంది. అయినా ఆయన ఇలా ఎందుకు అన్నారబ్బా అని ఎవరైనా ఆలోచిస్తే, ఇందులో రాజకీయం కూడా మిళితమై ఉందా అన్న సందేహం కలుగుతుంది. కుంభ వృష్టి , ఆకస్మిక వరదల వంటివి మనదేశానికే పరిమితం కాదు. చైనా, అమెరికా , ఇండోనేషియా తదితర దేశాలు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కుంటున్నాయి. చైనా, అమెరికాలకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర చేయగలిగే పరిస్థితి ఉంటుంది? ఈ మధ్యకాలంలో చైనాలో వచ్చిన వరదలతో జనం తీవ్ర కష్టనష్టాలపాలయ్యారు. అనేక మంది మరణించారు. అనేక ఇళ్లు కూలిపోయాయి. అయినా చైనా ఇలాంటి ఆరోపణ చేసినట్లు లేదు.
అమెరికాలో కొన్ని సార్లు వరదలు వచ్చినప్పుడు రోజుల తరబడి ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. మంచు తుపానుల గురించి చెప్పనవసరం లేదు. కొన్ని సార్లు రోజుల తరబడి ట్రాఫిక్ జామ్ లు అవుతుంటాయి.వేసవికాలంలో వైల్డ్ ఫైర్ అయితే వేలాది ఎకరాలలోని అడవులను దహించి వేస్తుంటుంది. ఆ ప్రాంతాలలో ఉన్న భవంతులు కూడా ఆగ్నికీలలకు ఆహుతి అవుతుంటాయి. తాజాగా బ్రిటన్ , ఇటలీ, స్పెయిన్, జర్మని ప్రాన్స్ వంటి దేశాలు విపరీతమైన ఎండలతో అల్లాడుతున్నాయి. ప్రజలు వాటిని తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
వందలాది మంది వడగాడ్పులకు మరణిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికాలో టోర్నెడోలు అంటూ ఒక్కసారిగా సుడిగాలి సంభవించి ఒక ప్రాంతంలోని ఇళ్లన్నిటిని పునాదులతో సహా పెకలించి వేస్తుంటుంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు వల్ల సంభవించేవి. క్లైమేట్ చేంజ్ పై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు.దానివల్ల వచ్చే విపరిణామాలను ఎప్పటికప్పుడు వివరిస్తుంటారు. ఇలా ఎన్నో అనుభవాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటే భారత్ లో ఆకస్మిక వరదలకు , కుట్రలకు ఏమైనా సంబంధం ఉందా అంటే అవునని చెప్పడం కష్టమే. కొందరు నిపుణులు కాని, గవర్నర్ తమిళసై కాని కేసీఆర్ వాదనను తోసిపుచ్చారు.లడక్ ,ఉత్తరాఖండ్ వంటి చోట్ల ఇవి సంభవించిన్పుడు ఎవరూ ఈ సందేహం వ్యక్తం చేయలేదు. కొద్ది మంది టీఆర్‌ఎస్ నేతలు విదేశీ కుట్ర ధీరిని బలపరిచినా, అది వారి నాయకుడిని సమర్ధించాలి కనుక మాట్లాడారేమో అనిపిస్తుంది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు దీనిపై కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించాయి. వరదల నియంత్రణ, సహాయ చర్యలలో వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేశారని వారి ఆరోపణ.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లు మునిగిపోవడం, ఆ ప్రాజెక్టు బాక్ వాటర్ వల్ల మంచిర్యాలతో సహా పలు పట్టణాలు, గ్రామాలు జలమయం అవడం వంటి వాటి గురించి పెద్దగా చర్చ జరగకుండా చూడడం టీఆర్‌ఎస్ లక్ష్యమని వారు అంటున్నారు. ఈ ఆరోపణలలో ఎంత నిజం ఉందో కాని, టిఆర్ ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యకు ఎన్నడూ రానంతగా ఊహించని స్థాయిలో వరదలు రావడమేనని చెబుతున్నారు.ఇతర చోట్ల పంప్ హౌస్ లు మునిగిన ఉదంతాలను ఏకరువు పెడుతున్నారు. ఇది కూడా నిజమే కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వేగం, పూర్తి అయిన తీరు చూసి పలువురు కేసీఆర్ ను మెచ్చుకున్నారు. ఎనభై వేల కోట్లను వ్యయం చేసి ఆ స్థాయి నిర్మాణాన్ని ఒక రాష్ట్రం చేయడం అరుదైన విషయమే. అయితే దీనివల్ల కలిగిన ప్రయోజనాలపై బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బాక్ వాటర్ ప్రభావం తదితర ముఖ్యమైన వాటిపై సరిగా అధ్యయనం జరగలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపైనే అదికంగా చర్చ జరిగింది.
ఇంతవరకు ఒక రకం అయితే ఆయనకు మద్దతుగా కేంద్రం కాని, ఇతర రాజకీయ పక్షాలు కాని మాట్లాడకపోవడంతో కేసీఆర్ వి రాజకీయ వ్యాఖ్యలే అన్న భావన ఏర్పడడానికి అవకాశం వచ్చింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధ్యం కాని కేంద్రం స్పష్టం చేయడం, దానికి పెట్టుబడి క్లియరెన్స్ లేదని చెప్పడం మరో సారి కేంద్ర, రాష్ట్రాల మధ్య వాదోపవాదాలకు అవకాశం వచ్చింది. దీనిని టీఆర్‌ఎస్ సెంటిమెంట్ గా వాడుకునే అవకాశం ఉంటుంది. ముందుగా పెట్టుబడి వ్యయ అంచనాపై కేంద్రం నుంచి ఆమోదం పొంది ఉంటే బీజేపీ ఆత్మరక్షణలో పడేది.కాని అది జరగకపోవడంతో టీఆర్‌ఎస్ పై బీజేపీ దాడి చేసే అవకాశం ఉంటుంది.
ఇక పోలవరం ఎత్తు , భద్రాచలం వద్ద ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న మంత్రి అజయ్ డిమాండ్ కొత్తదేమీ కాదు. గతంలో కేంద్రం ఈ మండలాలలోని వివిధ గ్రామాలను ఏపీలో విలీనం చేసినప్పుడే కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు పిలుపు ఇచ్చి అప్పట్లో నిరసన తెలిపింది. ఆ తర్వాత అది పూర్వపక్షం అయింది. ఖమ్మం ,భద్రాచలం వారికి దగ్గరగా ఉండడం తో ఆ గ్రామాలవారికి తెలంగాణలోనే ఉండాలని అనుకోవచ్చు. అయితే ఒకప్పుడు అవి ఏపీలోనే గ్రామాలే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం 1952, 1955 ఎన్నికలలో ఆంద్ర రాష్ట్రంలో బాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. ఉమ్మడి రాష్ట్రం తర్వాత అది ఖమ్మం జిల్లాలో భాగమైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ ఏడు మండలాలలోని వివిధ గ్రామాలు నీట మునుగుతాయని అంచనా వేసి భూములకు పరిహారం ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ ప్రకారం ముందుకు కూడా వెళ్లింది. అయితే పెరిగిన భూముల ధరల నేపద్యంలో వారికి అధిక పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సుమారు ఏభై వేల కోట్ల రూపాయల ప్యాకేజీని నిర్వాసితులకు అందించాలని విజ్ఞప్తి చేసింది. అది ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా పోలవరం ఎత్తు తగ్గించకపోతే భద్రాచలం మునిగిపోతుందని మంత్రితో పాటు నీటిపారుదల సంస్థ చైర్మన్ ప్రకాష్ తదితరులు వాదన చేశారు.నిజానికి ;పోలవరం ప్రాజెక్టు లేనప్పుడు కూడా భద్రాచలం, పరిసర మండలాలు నీట మునిగాయి. అన్ని విషయాలను కేంద్ర సంస్థలు పరిశీలించిన తర్వాతే ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాయి. ఈ విషయం అందరికి తెలుసు. అయినా సెంటిమెంట్ రీత్యా తెలంగాణ రాజకీయాలకు కొంత ఉపయోగపడుతుందన్న భావనో లేక నిజంగానే ఆ ముంపు మండలాల ప్రజల కోరికను అజయ్ బయటపెట్టారో కాని, అది చర్చనీయాంశంగా మారింది.
అయినా ఈ దశలో ఎత్తు తగ్గించడం అన్నది సాధ్యపడకపోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా సమస్య అధికం అవుతుందని అనుకుంటే నీటి నిల్వను కొంత తక్కువ మట్టంలో ఉంచవచ్చు. అది రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టును తొలుత 36లక్షల క్యూసెక్కుల సామర్ధ్యంతో ప్రతిపాదించినా, ఏదైనా ప్రమాదం జరిగితే రాజమండ్రితో సహా పలు ప్రాంతాలకు నష్టం వస్తుందనే దానిని ఏభై లక్షల క్యూసెక్యులకు పెంచారు. అయినా ప్రకాష్ రాజమండ్రి కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పడం అంత సహేతుకంగా అనిపించదు. రాజమండ్రితో సహా ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, మొత్తం ఏపీ ప్రజలు ఈ ప్రాజెక్టు తమ కలగా భావించారన్న సంగతి గుర్తించాలి. ఏది ఏమైనా సున్నితమైన నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలలో రెండు రాష్ట్రాల నేతలు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు సాగుతున్నాయి. అవి చాలవన్నట్లు కొత్త పంచాయతీలు పెట్టుకోకుండా ఉంటే బెటర్ .కాని ఎన్నికల రాజకీయాలలో అది ఎంతవరకు సాధ్యం అన్నది చెప్పడం కష్టమే.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment