తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు మిస్టరీ ఒక ప్రహసనంగానే మిగిలిపోతుందా? ఈ ఉదంతం మొత్తం పరిశీలిస్తే టీఆర్ఎస్ తొందరపడిందా అన్న సంశయం వస్తుంది. గతంలో ఓటుకు నోటు కేసులో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ఈనాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న ఘటన గుర్తున్నవారందరికి టీఆర్ఎస్ మరో సంచలనం సృష్టించిందని, తనకు సవాల్ విసురుతున్న భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేసిందని అనిపించింది. కాని చివరికి ఇది ఒక రాజకీయ క్రీడగానే మిగిలిపోయిందా అన్న భావన కలుగుతుంది.
చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!
బుధవారం రాత్రి టీవీ చానళ్లలో జరిగిన హడావుడి చూస్తే, ఇదేదో వందల కోట్ల వ్యవహారమని, కోట్ల డబ్బు పట్టుబడిపోయిందని అనిపించింది. కొన్ని చానళ్లు పదిహేను కోట్ల రూపాయల మొత్తం దొరికిందని స్క్రోలింగ్‌లు ఇస్తే, మరికొన్ని చానళ్లు దానిని వంద కోట్లుగా కూడా ప్రచారం చేశాయి. మరి కాసేపట్లో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారని సమాచారం రాగానే, ఆ డబ్బును ప్రదర్శిస్తారని అనుకున్నాం. కాని ఆయన పొడి, పొడిగా మాట్లాడి వెళ్లడం సందేహాలకు తావిచ్చింది. ఆయన డబ్బు గురించి కాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయం కాని గట్టిగా ఏమీ చెప్పలేదు. కాకపోతే వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పి వెళ్లిపోయారు.
మీడియా వారు డబ్బు దొరికిందా అని మరో పోలీసు అధికారిని ప్రశ్నించినా, ఆయన ఏమీ జవాబు ఇవ్వలేదు. దాంతో ఇందులో తేడా ఉందని అనుకున్నారో, ఏమో కాని టీవీలలో డబ్బు గురించిన ప్రస్తావనను ఆపివేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్నది అభియోగం. ఒక్కొక్కరికి వంద కోట్ల ఆఫర్, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి వచ్చినవారిలో ఒకరు పూజారి కాగా, మరొకరు చిన్న స్థాయి స్వామీజి. ఇంకొకరు ఒక చిన్న వ్యాపారవేత్త. ఒక సమాచారం ప్రకారం వీరేదో చిన్న, చిన్న బ్రోకరేజీలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారట.
బీజేపీలోకి వస్తే డబ్బు వస్తుందని చెప్పి, అందులో తమకు ఎంత కమిషన్ ఇస్తారని అడగడానికి వచ్చి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. వీరికి వందల కోట్లు హాండిల్ చేస్తే సత్తా, లేదా స్థోమత ఉందా అన్న డౌటు వచ్చింది. సదరు వ్యాపారికి అటు టిఆర్ఎస్‌తో, ఇటు బీజేపీతోనూ సంబంధాలు ఉన్నాయట. వీరేదో డీల్ గురించి మాట్లాడినప్పుడు ఆడియోలు ఉన్నాయని పోలీసులు అంటున్నా, వాటిని కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదో తెలియదు. పైగా ఎవరైనా కీలక నేత, వీరితో మాట్లాడిన ఆడియో ఉంటే దానికి విశ్వసనీయత వస్తుంది కాని, సదరు వ్యక్తి తనకు ప్రధాని తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు.. హోం మంత్రి తెలుసు అంటూ మాట్లాడితే, దానిని రికార్డు చేస్తే ఏమి ప్రయోజనం. దానిని ఎవరు నమ్ముతారు. పోసుకోలు కబుర్లుగానే భావిస్తారు తప్ప ఇంకొకటి ఉండదు.
కాగా ఇదే సమయంలో మరి కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఎందుకు అన్నారు?. అసలు ముఖ్యమంత్రి కేసీఆరే మీడియా సమావేశం పెడతారని ఎందుకు ప్రచారం జరిగింది?. తమను బీజేపీ కొంటానికి వచ్చిందని చెప్పిన ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలేదు?. తొలుత టీఆర్ఎస్‌కు ఇదేదో ఊపు తెస్తుందని అనుకుంటే, చివరికి బూమ్ రాంగ్ అయిన చందంగా పరిస్థితి మారింది. బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. వారు దీనిపై సీబీఐ విచారణ లేదా, సిటింగ్ జడ్జి తో విచారణ కోరుతున్నారు. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.
ఈలోగా ఏసీబి కోర్టు డబ్బు చూపకపోతే అవినీతి నిరోధక కేసుకిందకు రాదని స్పష్టం చేయడంతో ఇది మొత్తం వీగిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఓటుకు నోటు కేసు ఘటన జరిగినప్పుడు ఆ వెంటనే పట్టుబడిన డబ్బుతో సహా , రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సంభాషణ వీడియో మొత్తం బయటకు వచ్చేసింది. ఏసీబీ పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకుంది. తదుపరి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోన్ సంభాషణ ఆడియో కూడా బహిర్గతం అయింది. దాంతో కేసీఆర్ సమర్ధతపై ప్రజలందరిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన ఇమేజీ బాగా పెరిగింది. కేవలం ఏభై లక్షలు పట్టుబడితేనే అంత మైలేజీ వచ్చినప్పుడు, వందల కోట్ల ఉదంతంలో ఇంకెంత మైలేజీ రావాలి?. బీజేపీ ఎంతగా బదనాం కావాలి.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలో భారీగా డబ్బు వెదజల్లుతోందని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కూడా అలాగే ఏమైనా జరిగిందేమోనని చాలా మంది అనుకున్నారు. తీరా అక్కడ ఏవో బ్యాగులు చూపడం మినహా డబ్బు చూపకపోవడంతో కేసు బలహీనమైపోయింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు తరచుగా ఆ పామ్ హౌస్ లో కలుస్తుంటారట. వీరిలో బాలరాజు తప్ప మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరినవారు. అందువల్ల వీరి విధేయత గురించి పెద్దగా చర్చించుకోనవసరం లేదు.
మునుగోడులో ఎన్నికల ప్రచారంలో ఉండవలసిన వీరు ఇక్కడ పామ్ హౌస్‌లో ఎవరితోనో సంప్రదింపులలో ఉన్నారన్న సమాచారం అందడంతో అదేదో బీజేపీ కుట్రేమోనని అనుమానించి పోలీసులను పంపించారా అన్న సందేహం కలుగుతంది. అంటే మిస్ ఇన్ ఫర్మేషన్ వల్ల పోలీసులు అక్కడకు రావడం, అలాగే మీడియాకు కూడా ఈ విషయం తెలియడంతో నానా రచ్చ అయి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు పామ్ హౌస్‌కు వెళ్ళినప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా బిత్తరపోయారట. కాని ఆ తర్వాత తేరుకుని తామే ఫిర్యాదు చేశామని వారు చెప్పారు.
ఒకవేళ నిజంగానే బీజేపీ ఇలాంటి ఆపరేషన్ చేయదలిస్తే పొరుగున బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి కాకుండా ఇంత తెలివితక్కువగా ఒక పామ్ హౌస్ ద్వారా ఆపరేట్ చేస్తుందా అన్న ప్రశ్న వస్తుంది. దీనిపై కేసీఆర్ స్పందించలేదు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. యాదాద్రిలో ప్రమాణం చేద్దామని సంజయ్ సవాల్ చేస్తే, మోదీ ఆ ప్రమాణానికి రావాలని టీఆర్ఎస్ ప్రతి సవాల్ చేసింది.
విశేషం ఏమిటంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో బీజేపీకే కాదు.. టీఆర్ఎస్‌కు కూడా రికార్డు ఉంది. గత టరమ్‌లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పి ఎమ్మెల్యేలు పలువురిని తనలో కలిపేసుకుంది. ఈ టరమ్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది ఉంటే పన్నెండు మందిని టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అందువల్ల ఈ విషయాలలో ఎవరిని తప్పు పడదాం? ఏమైనా వర్తమాన రాజకీయాలలో ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలు ఇంత అసహ్యంగా తయారయ్యాయనడానికి ఈ తాజా ప్రహసనం కూడా ఒక ఉదాహరణే అవుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment