టీఆర్‌ఎస్‌తో పొత్తుకాదు శత్రుత్వమే: రేవంత్
మోసం చేసిన సీఎంను ఎండగట్టడానికే ప్రజాపోరు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా జీవితాన్ని విధ్వంసం చేస్తూ, ఉద్యమ ఆకాంక్షల ముసుగులో అధికారంలోకి వచ్చి ఉద్యమకారులను మోసం చేసిన టీఆర్‌ఎస్ తమకు రాజకీయంగా ప్రధాన శత్రువని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా కంటక టీఆర్‌ఎస్‌ను, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఎదిరించి పోరాటం చేసేవారితో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్ అధికారం చేపట్టినప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ముడుపులు తీసుకోవడానికే పరిమితమయ్యారని, అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. (టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీ-దేశం సందేశం!)
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి ప్రధానమైన హామీలను అమలు చేయలేదన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడు తూ హామీలను విస్మరిస్తుంటే... తెలంగాణ మంత్రులు చేతకాని దద్దమ్మల్లాగా పడి ఉంటున్నారని రేవంత్ విమర్శించారు. సీఎం, మంత్రులు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రజాపోరును నిర్వహిస్తున్నా మన్నారు. కేసీఆర్‌పై ప్రజాక్షేత్రంలోనే పోరాడతామని, నియంతృత్వం, అరాచ కాల నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని, దీనికోసమే సీఎం, మంత్రుల నియోజకవర్గాలో శనివారం నుంచి బహిరంగసభలకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.