
ఇంకా తెలవారదేమి..
సంస్థాగత పదవులపై గులాబీ నేతల ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ నేతలు, శ్రేణులను ఊరిస్తున్న సంస్థాగత పదవుల వ్యవహారంలో మరింతగా ఎదురు చూపులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన పార్టీ కమిటీల ఏర్పాటు మరింత ఆలస్యమవు తోంది. గత నెల 29 నాటికే పార్టీ పదవులకు ఎంపిక పూర్తవుతుందని... జిల్లా, రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటిస్తారని టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ మళ్లీ వాయిదా పడింది. దీం తో పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు.
అభ్యంతరాలతోనే..
పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య పేచీలు, కూర్పు కుదరకపోవడం వంటి అంశాలపై నాయకత్వం పెద్ద కసరత్తే చేసింది. ఆయా జిల్లాల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కొత్త కమిటీల జాబితాకు తుది రూపు ఇవ్వలేక పోయింది.
ప్లీనరీ దగ్గర పడడంతో..
ఏటా ఏప్రిల్ నెలలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. అందులో భాగంగా వచ్చే ఏప్రిల్‌లో 16వ ప్లీనరీ జరగాల్సి ఉంది. మరోవైపు పార్టీ రెండేళ్లకోమారు సభ్యత్వ నమోదు, కొత్త కమిటీల ఎన్నిక వంటి నిబంధనల వల్ల ఈ ఏడాది సభ్యత్వాల రెన్యూవల్, కొత్త సభ్యత్వాల నమోదు చేపట్టాల్సి రానుంది. ప్రస్తుతం ప్లీనరీకి రెండు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో.. కొత్త కమిటీల నియామకం కుదరదని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. అందువల్ల ముందుగా సభ్యత్వ నమో దు కోసం షెడ్యూల్‌ను ప్రకటించను న్నారు. సభ్యత్వాల నమోదు కార్యక్రమం ముగిశాక.. గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా నిర్వహించే 16వ ప్లీనరీ సమయానికి కమిటీలను పూర్తి చేస్తారని పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు
టీఆర్‌ఎస్‌కు ఇప్పటిదాకా జిల్లాల్లో ఎక్కడా పెద్దగా సొంత కార్యాలయాలు లేవు. ప్రస్తుతం కరీంనగర్‌లో మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యమ సమయం నుంచీ ఇదే పరిస్థితి. అయితే ప్రస్తుతం అధికార పార్టీ హోదాలో టీఆర్‌ఎస్ సొంత భవనాలను సమకూర్చుకుని పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దీనిపై ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఏడాదిలోగా అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు అందుబాటులోకి వచ్చేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు సభ్యత్వ నమోదు పూర్తయ్యాక క్రియాశీలక సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ రెన్యూవల్, కొత్త వారికి బీమా కల్పించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.