గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్
• ప్రతిపక్షాలకు ఎజెండాయే లేదు
• సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం
• మంత్రులు సహా అంతా సభలో హుందాగా ఉండాలి
• ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు
• అధికారపక్ష సభ్యుల హాజరు నూరుశాతం ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్య క్రమాలను అసెంబ్లీ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిద్దామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదని, అందువల్ల మనమే మాట్లా డాలని, సమయాన్ని సద్వినియోగం చేసు కోవాలని స్పష్టం చేశారు. గురువారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. ‘‘సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదు. ఏం మాట్లాడినా మనమే మాట్లాడాలి. బీఏసీ సమావేశానికే విపక్షాలు నాలుగైదు అంశాల పాయింట్లు రాసుకుని వచ్చాయి. అత్యధిక సభ్యులం మనమే ఉన్నాం. మన సమయం మనం వినియోగించుకుందాం. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం చేశామో ప్రజలకు వివరిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ విషయంలో నిక్కచ్చిగా ఉందామని, నిర్ణీత గడువులోగా సమాధానాలు చెప్పాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సభ్యులు అడిగిన ప్రశ్నల పరిధిలోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు సమాచారం ఇస్తూ, విషయం నుంచి ఎందుకు పక్కకు పోతున్నారని కూడా ప్రశ్నించారని తెలిసింది. మంత్రులు, ఇతర సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటి దురుసుకు పోవద్దని, సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు.
అందరూ రావాల్సిందే..
ఈ సమావేశాలు కీలకమైనవని, పార్టీ సభ్యుల హాజరు నూటికి నూరుశాతం ఉండాల్సిందే నని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సమావేశం ముగిసే వరకూ ఉండాలని, తప్పని పరిస్థితి అయితే, ఆయా జిల్లాల మంత్రులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. ‘‘మంత్రులు కంట్రోల్‌లో ఉండాలి. ప్రశ్నలకు గణాంకాలు సహా సంతృప్తికర సమాధానాలివ్వాలి. ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇద్దాం. ఎక్కువ రోజులు సభ జరపాలని విపక్షాలు కోరుతున్నాయి. అవసరమైతే సమావేశాలను పొడిగిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
నోట్ల రద్దుపై నేనే మాట్లాడతా..
నోట్ల రద్దు రాష్ట్ర పరిధిలో తీసుకున్న నిర్ణయం కాదని, అది మన అంశమే కాదని.. విపక్షాలు కోరినందున చర్చకు పెడుతున్నామని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని, తానే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇక తొలిరోజు మండలిలో విద్యుత్ పరిస్థితిపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడతారని, రెండో రోజు మండలిలో నోట్లరద్దు అంశంపై తాను మాట్లాడతానని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించామని, అయితే అదే సమయంలో ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రధాని దృష్టికి తీసుకువెళుతున్నామని తెలిపారు. నోట్ల రద్దుతో మనకూ నష్టం జరిగిందని, ఆదాయం పడిపోయిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగిందన్నారు.
‘నాగం’ బండారం బయటపెట్టండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల్లే వంటూ చెన్నైలోని ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ’ నుంచి బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్టే తీసుకువచ్చిన అంశంపై భేటీలో చర్చ జరిగింది. దీనిపై ఎవరూ భయపడొద్దని, ప్రాజెక్టు ఎక్కడికి పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మహబూబ్‌నగర్ ప్రజలకు వాస్తవాలు వివరించాలని, నాగం బండారం బయట పెట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్లు పెట్టి నాగం ఆ జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తున్న విషయాన్ని బయటపెట్టాలని చెప్పారు.