
పసికందుల ఉసురు తీసిన వాహనం
సొంత ఊరు వదిలి ఉపాధి కోసం వలస వచ్చిన కూలీలకు పుత్రశోకం మిగిలింది. అప్పటిదాకా ఆడుకుని చెట్టుకింద నిద్రపోతున్న ఇద్దరు బిడ్డలపైకి రెడిమిక్స్ వాహనం ఎక్కడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
సత్తెనపల్లి: సొంత ఊరు వదిలి ఉపాధి కోసం వలస వచ్చిన కూలీలకు పుత్రశోకం మిగిలింది. అప్పటిదాకా ఆడుకుని చెట్టుకింద నిద్రపోతున్న ఇద్దరు బిడ్డలపైకి రెడిమిక్స్ వాహనం ఎక్కడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. సత్తెనపల్లి పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిదారకమైన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు...
అచ్చంపేట రోడ్డు రైల్వే గేటు సమీపంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారి పక్కన సైడు డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం నల్గొండ జిల్లా ఆలియా నుంచి ఏడు కుటుంబాల వారు ఇక్కడ పనులు చేపట్టేందుకు వచ్చారు. శనివారం తల్లిదండ్రులు డ్రెయినేజీ కాలువ నిర్మాణ పనుల్లో నిమగ్నం కాగా, రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు బిడ్డలు కొద్దిసేపు ఆడుకుని చెట్టుకింద నిద్రిస్తున్నారు. సమీపంలోనే డ్రెయినేజీ కాలువల నిర్మాణానికి అవసరమైన చిప్స్, ఇసుక ఉన్నాయి. ఏపీ 07 సీఎన్ 1377 రెడిమిక్స్ వాహనం ఓ విడత చిప్స్, ఇసుక పోసుకుని పనుల వద్దకు తీసుకెళ్ళింది. రెండో విడత వాటిని నింపుకుని వెనక్కు రివర్స్ చేసుకునే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో నిద్రిస్తున్న చిన్నారులపైకి ఎక్కింది. పింగిలి శరత్ (4) అనే బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా, సంపంగి చందూ (2) తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన అక్కడివారు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీశాడు. పిల్లాడు చని పోయాడని తెలియడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన చందూను భుజాన వేసుకుని తల్లిదండ్రులకు వైద్యశాలకు పరుగులు తీశారు. చికిత్స పొందుతూ చందూ మృతి చెందాడు. శరత్ తల్లిండ్రులు సుమలత, శ్రీను..,చందూ తల్లి దండ్రులు కోటమ్మ, రమేష్ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. కాగా, మృతి చెందిన ఇరువురు పిల్లలకు కొద్ది దూరంలోనే మరో పిల్లవాడు పడుకున్నాడు. దూరంగా పడుకోవడంతో అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ప్రమాదం జరిగినా పట్టించుకోని వైనం..
సంఘటన పది గంటల సమయంలో జరిగినప్పటికీ 12 గంటల వరకు కూడా మున్సిపల్ అధికారులు కానీ, పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ కానీ అక్కడికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కుమిలి పోయారు. సంఘటనా స్థలానికి వైఎస్సార్ సీపీ నాయకులు జూపల్లి పాల్, సయ్యద్ మహబుబ్, సాంబ హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం పాదయాత్రలో ఉన్న సీపీఎం డివిజన్ కార్యదర్శి గుంటూరు విజయకుమార్, సీపీఎం పాదయాత్ర బృందం అక్కడకు చేరుకుని మృతుల తల్లిదండ్రులను ఓదార్చారు. అర్బన్ సీఐ ఎస్. సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.
అధికార పార్టీ నాయకుని శవరాజకీయాలు
∙ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా ఆయా కుటుంబాలను ఓదార్చి న్యాయం చేయాల్సింది పోయి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పైరవీలు ప్రారంభించాడు. సంఘటనా స్థలంలో మృతదేహలు ఉండగానే శవ రాజకీయాలకు పాల్పడ్డారు. నేరుగా అధికార పార్టీ నేత పోలీసులతో మాట్లాడి కేసు బలంగా లేకుండా ఉండేలా ప్రయత్నాలు చేపట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఐ సాంబశివరావును వివరణ కోరగా తమతో ఎవరూ పైరవీలు జరపలేదని, ఇద్దరు బిడ్డల మృతికి కారణమైన రెడిమిక్స్ వాహన డ్రైవర్ పాటి బండ్ల వెంకట క్రిష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.