ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలు
- వారం రోజుల్లోనే ఇద్దరు మృతి
- కలిసిరాని వ్యవసాయం 4 ఆదుకోని ప్రభుత్వం
- నత్తనడకన త్రిసభ్య కమిటీ విచారణ
- పరిహారం అందింది ఏడుగురికే
కడప అగ్రికల్చర్ : రైతే రాజు...రైతులేనిదే రాజ్యం లేదు... అని పండితులు,పాలకులు కీర్తిస్తుంటారు. అయితే ఆ రైతు కష్టాల సుడిలో చిక్కుకున్నాడు. పంటలసాగుకు చేసిన అప్పులు తీర్చలేని రుణబకాయిదారుడుగా మిగిలిపోయి.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుంటే పాలకులు గుడ్లప్పగించి చూస్తున్నారేగాని, సాయమందించి ఆదుకుందామనే ఆలోచన కలగకపోవడం బాధాకరం. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జిల్లాలో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జన్మనిచ్చిన తల్లి తరువాతి స్థానం రైతన్నదే అన్న విషయం పాలకులకు తెలిసినా ఆదుకోవాలనే ధ్యాస కలగకపోవడం దారుణం.
రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సింది పోయి తప్పుపట్టం అవకాశంగా చేసుకుంది. ప్రభుత్వ హామీలు అమలుకాక, సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీలు అందక, పంటలకు రుణాలు మంజూరుకాక, బీమా చేతికందక, కాలం కలిసి రాక అన్నదాత జీవనపోరాటం చేస్తూ కుదేలవుతున్నాడు. సాగుకు చేసిన అప్పుల కుప్పలు మిగులుతున్నాయే తప్ప పంటల కుప్పలు కనింపించడం లేదు. పంటల కోసం తెచ్చిన మందులు ఆయా పంటల చీడపీడలు వదులుతున్నాయో లేదోగానీ రైతును మాత్రం బలి తీసుకుంటున్నాయి.
11 నెలల్లో 10 మంది ఆత్మహత్య
జిల్లాలో అప్పుల బాధ తాళలేక నెలకు ఒకరిద్దరు చొప్పున 10 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయంలో సంపాదించిన దానిని నలుగురికి పెట్టడమే తప్ప ఎవరి వద్ద చేయి చాపి అడిగిన వారే కాదు. అంతటి ఆత్మాభిమానం ఉన్న రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే అప్పుల కుంపటి ఎంతగా కుంగదీస్తుందో ఇట్టే అర్థమవుతుంది.
చెన్నూరు, వేముల, పుల్లంపేట,కొండాపురం,సిద్దవటం, టి సుండుపల్లి, తొండూరు, పులివెందుల,లింగాల మండలాల్లో ఈ ఎనిమిది నెలల కాలంలో 10 మంది తనువు చాలించారు. ప్రభుత్వం జిల్లా యంత్రాంగంలోని అధికారులతో త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు తెలుసుకుని నివేదికలు తయారు చేసి జిల్లా వ్యవసాయశాఖకు పంపాల్సి ఉంటుంది. అయితే త్రిసభ్య కమిటీ విచారణ నత్తనడకన సాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న వారు అధికారికంగా 18 మంది ఉన్నారని తేల్చారు. ఇందులో 10 కుటుంబాల వారిని మాత్రమే విచారించారు. మరో రెండు కుటుంబాల వారికి సంబందించి ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. విచారణ పూర్తి చేసిన వారి వివరాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే ఇప్పటి వరకు కేవలం ఏడుగురికి మాత్రమే పరిహారం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో 38 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యలను నిలువరించలేని ప్రభుత్వం
ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు మండల కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇప్పించడం, వారిలో ఆత్మస్థైర్యం నింపడం, వారికి ఉన్న బాధలు అప్పులను ఎలా తీర్చుకోవచ్చో సలహాలు, సూచనలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని మేధావులు అంటున్నారు, స్వల్సకాలిక వంగడాలను తెప్పించి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించడం, అ«ధిక సబ్సిడీలు ఇచ్చినట్లైతే అన్నదాతలు చాలా వరకు నష్టాల నుంచి గట్టెక్కుతారని, కొంతమందైనా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు అంటున్నారు.