రైతుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించి ఆర్థికాభివృద్ధి చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన రైతు మిత్ర సంఘాలకు రెండేళ్లరుునా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. వారికి ఇస్తామని చెప్పిన రూ.1.50 కోట్లు ఇంత వరకు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వంపై రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
ఒంగోలు: రైతులను సంఘటితం చేసి ప్రభుత్వ పథకాలు వారి దరిచేరేలా 2001లో ఏర్పాటు చేసిన రైతు క్లబ్బులను రైతుమిత్ర గ్రూపులుగా పేరుమార్చి రెండేళ్ల క్రితం మళ్లీ టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించి ఆర్థికాభివృద్ధి చేకూర్చుతామని నమ్మబలికింది. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో, ప్రభుత్వ రాయితీలు, యంత్రాలు అందించడంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సంఘాల పాత్రే కీలకమని చెప్పించింది. రెండేళ్లయినా కొత్తగా ఏర్పడిన సంఘాలకు ప్రోత్సాహం కరువైంది.
14 ఏళ్ల నాటి పథకం..
రాష్ట్రంలో 14 ఏళ్ల కిందట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2001లో రైతు క్లబులను ఏర్పాటు చేశారు. కొమరోలు లాంటి మారుమూల మండలాల్లో కూడా 25 క్లబ్బులు ఏర్పాటు చేశారు. 2002 సంవత్సరంలో మరో 148 రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. వీటి నిర్వహణకు 2001వ సంవత్సరంలో రూ.800, 2002వ సంవత్సరంలో రూ.2,500 ప్రకారం ప్రభుత్వం నిధులు ఇచ్చి ప్రోత్సహించింది.
దీంతో ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చి రైతు మిత్ర సంఘాలుగా బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కొక్క సభ్యుడు నెలకు రూ.50 ప్రకారం కొన్ని నెలల పాటు పొదుపు చేసుకున్నారు. సక్రమంగా పొదుపు చేసిన సంఘాలకు రూ.10 వేల ప్రకారం రివాల్వింగ్ ఫండ్ బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో అది అమలు కాలేదు. మళ్లీ రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే రైతు మిత్ర సంఘాలంటూ రైతుల్లో ఆశలు రేపింది. ఈ సారి ఒక్కొక్క సంఘానికి రూ.5 వేలు ప్రోత్సాహం కింద మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు మళ్లీ రైతులు చంద్రబాబును నమ్మారు. ఈ రెండేళ్లలో 1182 రైతు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మంజూరు చేస్తామన్న ప్రోత్సాహం కోసం ఎదురు చూశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లరుునా నేటికీ రైతుమిత్ర సంఘాల గురించి పట్టించుకోలేదు.
సంఘటిత శక్తిగా..
ప్రతి వంద హెక్టార్లకు ఒక రైతు మిత్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. జిల్లాలో మూడేళ్లలో మొత్తం 6,030 సంఘాలు మూడు విడతల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యం. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరికి సభ్యత్వం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో సంఘంలో 15 మంది సభ్యులుంటారు. రైతులు సంఘ బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా రూ.500 క్రమం తప్పకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి సంఘం నుంచి ఒకరు కన్వీనర్‌గాను, మరొకరు కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతుల మధ్య ఈ సంఘాలు వారధిగా పనిచేస్తారు.
ప్రయోజనాలు ఎన్నో..
ఈ సంఘాల్లోని రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయశాఖ ద్వారా సరఫరా చేసే యంత్ర పరికరాలు మంజూరు చేస్తారు. వ్యవసాయ విస్తరణకు మధ్యవర్తిగా..సాంకేతిక బదిలీ, మార్కెట్ సమాచారం, సూచనలు, భూసార పరీక్షలు, పశువైద్య శిబిరాల నిర్వహణకు ఈ సంఘాలు తోడ్పాటునందిస్తాయి. లక్ష్య సాధన కోసం రైతులను చైతన్యులను చేసేందుకు రైతు మిత్ర సంఘాలు దోహదపడతాయి.
నూతన సంఘాల నిర్వహణకు రూ.1.50 కోట్ల కేటాయింపు
జిల్లాలో 56 మండలాల్లో మొదటి విడతగా ఈ ఏడాది 2,010 రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం. వాటిలో ప్రతి రైతుమిత్ర సంఘానికి ..నిర్వహణ ఖర్చుల కింద రూ.5 వేలు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మొత్తం రూ.1.50 కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వం సంఘానికిచ్చే నిధులతో దస్త్రాల నిర్వహణ, క్షేత్ర సందర్శన లాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వం మంజూరు చేస్తామన్న ప్రోత్సాహం నేటికీ రాకపోవడంతో రైతుల్లో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఇప్పుడు రైతు మిత్ర సంఘం ఏర్పాటు చేసుకోమన్నా ముందుకొచ్చే రైతులు మచ్చుకైనా కనిపించని పరిస్థితి జిల్లాలో ఉంది.
రైతు మిత్రకు ప్రోత్సాహమేదీ?
Published Mon, Jun 27 2016 8:22 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement